కోతకు వచ్చాకే వరిపంట కోయించాలి
● అదనపు కలెక్టర్ దీపక్ తివారి
ఆసిఫాబాద్: కోత దశకు వచ్చిన తర్వాతే హర్వెస్టర్ యంత్రాలతో వరిపంట కోయించాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి వ్యవసాయ, సహకార, గ్రామీణాభివృద్ధి, పౌరసరఫరాల శాఖల అధికారులు, హర్వెస్టర్ వాహనాల యజమానులతో వానాకాలం వరికోతలపై సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వరిపొలం పూర్తి కోత దశకు వచ్చిన తర్వాతే యంత్రాలు వినియోగించాలన్నారు. దీని ద్వారా తేమ శాతం, తాలు, గడ్డి లేకుండా నాణ్యమైన పంట వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. రైతునేస్తం ద్వారా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతీ కొనుగోలు కేంద్రానికి వెళ్లి సూచనలివ్వాలన్నారు. జిల్లాలో 34 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, సంబంధిత అధికారులు సమర్థవంతంగా కొనుగోళ్లు చేపట్టాలని ఆదేశించారు. కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించామని తెలపారు. సమావేశంలో సహకార శాఖ అధికారులు బిక్కు, రబ్బానీ, అదనపు గ్రామీణ అభివృద్ధి అధికారి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment