ఆరుతడికే మొగ్గు
● యాసంగి సాగుకు వ్యవసాయశాఖ సన్నద్ధం ● జిల్లాలో 42,950 ఎకరాల్లో పంటలు ● నీటి సౌకర్యం లేక ఆరుతడి పంటల వైపు రైతుల చూపు ● అయినా గరిష్టంగా 21,455 ఎకరాల్లో వరి
యాసంగి సాగు వివరాలు
ఆసిఫాబాద్: జిల్లాలో యాసంగి సాగుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మండలాల వారీగా ప్రణాళికలు రూపొందించి రాష్ట్ర వ్యవసాయ శాఖకు నివేదించారు. ప్రస్తుతం జిల్లాలో వరికోతలు జోరుగా సాగుతుండగా మరో 15 రోజుల్లో పూర్తికానున్నాయి. అలాగే పత్తి ఏరివేత పనులు కూడా కొనసాగుతున్నాయి. వానాకాలం పంటల సీజన్ ముగుస్తుండగా.. అన్నదాతలు యాసంగి సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఈ ఏడాది యాసంగిలో జిల్లాలోని 15 మండలాల్లో 42,950 ఎకరాల్లో పలు రకాల పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ ప్రకటించినా సాగు విస్తీర్ణం గతం కంటే పెరిగే అవకాశం లేదని భావిస్తున్నారు. వరి పంట ఎకరాకు 3 బస్తాల యూరియా, 90 కిలోల డీఏపీ, 30 కిలోల పొటాష్ అవసరం ఉంటుంది. ఈ క్రమంలో జిల్లాకు సుమారు 4,200 మెట్రిక్ టన్నుల యూరియా, 70 మెట్రిక్ టన్నుల డీఏపీ, 4100 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్, 140 మెట్రిక్ టన్నుల పొటాషియం, 90 మెట్రిక్ టన్నుల సూపర్ పాస్పేట్ అవసరం ఉంటుందని అంచనా వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వానాకాలం పంటల చివరి దశలో ఉండడంతో యాసంగి సాగు ఎరువులపై వ్యవసాయశాఖ అధికారులు పూర్తిస్థాయిలో అంచనాలు సిద్ధం చేయలేదు.
పెరిగిన ఎరువుల ధరలు
యాసంగి సీజన్ ప్రారంభానికి ముందే ఎరువుల కంపెనీలు మూడు రకాల ఎరువుల ధరలు పెంచి రైతులపై భారం మోపుతున్నాయి. అత్యధికంగా వినియోగించే కాంప్లెక్స్ ఎరువుల రేట్లు పెంచాయి. గతేడాదితో పోలిస్తే బస్తాకు రూ.100 వరకు పెరిగింది. గతేడాది బస్తా రూ.1200 ఉండగా, ఈ ఏడాది రూ.1300కు చేరింది. డీఏపీ ధర పెంచకపోవడంతో రైతులకు కాస్త ఉపశమనం కలిగింది. ప్రస్తుతం డీఏపీ ఎరువుల బస్తాకు రూ.1350 లభిస్తుంది. డిసెంబర్ నెలాఖరు వరకు డీఏపీ ధర సైతం పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. కౌలు భూమి ధరలు, ఎరువులు, కూలీల ధరలు ఏటా పెరుగుతుండడంతో రైతులకు సాగు భారంగా మారింది.
ప్రణాళిక సిద్ధం చేశాం
జిల్లాలో యాసంగి సాగు ప్రణాళిక సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించాం. ప్రస్తుతం జిల్లాలో వరి కోతలతో పాటు పత్తి ఏరివేత పనులు కొనసాగుతున్నాయి. మిగిలిన జిల్లాలతో పోలిస్తే ఇక్కడ యాసంగి సాగు కాస్త ఆలస్యంగా ప్రారంభమవుతుంది. జిల్లాకు అవసరమైన ఎరువుల వివరాలతో నివేదిక సిద్ధం చేయాల్సి ఉంది. రైతులు పంటల మార్పిడిని పాటించాలి. – రావూరి శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయాధికారి
పంటరకం ఎకరాలు
వరి 21,455
గోధుమ 1,044
జొన్న 10,202
మొక్కజొన్న 2,560
శనగ 6,516
కందులు 85
పెసర 530
మినుము 36
వేరుశనగ 171
నువ్వులు 95
సన్‌ఫ్లవర్ 50
పొగాకు 25
కుసుములు 1
ఇతర పంటలు 180
వరి, జొన్న అధికం..
వానాకాలం సీజన్‌లో మొత్తం 4.50 లక్షల ఎకరా ల్లో వివిధ రకాల పంటలు సాగు చేయగా.. అందులో పత్తి పంట అత్యధికంగా 3.50లక్షల ఎకరాల్లో సాగైంది. ఇక యాసంగి సీజన్‌లో 42,950 ఎకరాల్లో పంటలు సాగు చేయనున్నట్లు అంచనా వేస్తున్నారు. జిల్లాలో సాగునీటి వనరులు తక్కువగా ఉన్నా బోరు సౌకర్యం ఉన్న అనేకమంది వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు. దీంతో వరిపంట 21,455 ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉంది. ఇక ఏజెన్సీలోని కెరమెరి, తిర్యాణి, సిర్పూర్(యూ), జైనూర్, లింగాపూర్ తదితర మండలాల్లో జొన్న సాగు ఎక్కువగా ఉంటుంది. వరి తర్వాత జొన్న 10,202, శనగ 6,516, మొక్కజొన్న 2,560 ఎకరాల్లో సాగు ఉంటుంద ని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు జిల్లాలోని వట్టివాగు, కుమురంభీం తదితర ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీరు న్నా చివరి ఆయకట్టు వరకు అందని పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురి సిన నేపథ్యంలో ప్రాజెక్టులు, చెరువుల్లోకి భారీ గా వరద చేరింది. కాలువల నిర్మాణం అసంపూర్తిగా ఉండటం, ప్రాజెక్టుల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ఆయకట్టు రైతులు కూడా ఆరుతడి పంటలకే పరిమితం కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment