డుమ్మాలకు చెక్‌ | - | Sakshi
Sakshi News home page

డుమ్మాలకు చెక్‌

Published Mon, Nov 25 2024 7:51 AM | Last Updated on Mon, Nov 25 2024 7:51 AM

డుమ్మ

డుమ్మాలకు చెక్‌

డీఎడ్‌ కళాశాలల్లో ‘ఫేషియల్‌’ అటెండెన్స్‌

ఛాత్రోపాధ్యాయులు, లెక్చరర్ల హాజరుపై ఎస్‌సీఈఆర్టీ ఫోకస్‌

త్వరలోనే ఎఫ్‌ఆర్‌ఎస్‌ అమలు

ఆదిలాబాద్‌టౌన్‌: ఉపాధ్యాయ విద్యను గాడిలో పెట్టడంపై ఎస్‌సీఈఆర్టీ దృష్టి సారించింది. డీఎడ్‌ విద్యార్థులు క్రమం తప్పకుండా తరగతులకు హాజ రయ్యేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఫేషియల్‌ రికగ్నైజేషన్‌ సిస్టమ్‌ (ఎఫ్‌ఆర్‌ఎస్‌)ను అమలులోకి తెచ్చింది. ప్రస్తుతం సర్కారు బడుల్లో విద్యార్థులకు ఈ విధానం అమలులో ఉంది. తాజా గా ప్రభుత్వ, ప్రైవేట్‌ డీఎడ్‌ కళాశాలల్లో అమలుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రైవేట్‌ కళాశాలల్లో అభ్యసించే కొంతమంది ఛాత్రోపాధ్యాయులు తరగతులకు ఎగనామం పెడుతున్నారు. వారు నేర్చుకుంటేనే విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన చేసే అవకాశం ఉంటుంది. అయితే చాలా కళాశాలల్లో తరగతులకు హాజరు కాకుండా యాజమాన్యాలతో ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఇందుకోసం డబ్బులు ముట్టజెబుతున్నారు. ఇలాంటి అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు ఎస్‌సీఈఆర్టీ ఎఫ్‌ఆర్‌ఎస్‌ను అమలులోకి తెచ్చింది.

ఉమ్మడి జిల్లాలో..

ఉమ్మడి ఆదిలాబాద్‌లో ఏడు డీఎడ్‌ కళాశాలలు ఉన్నాయి. ఇందులో ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రభుత్వ డీఎడ్‌తో పాటు రెండు ప్రైవేట్‌ కళాశాలలు ఉన్నా యి. ప్రభుత్వ డైట్‌లో 300 మంది విద్యను అభ్యసిస్తున్నారు. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మీడియంలో కోర్సులు కొనసాగుతున్నాయి. అలాగే వివేకానంద, విద్యార్థి ప్రైవేట్‌ కళాశాలలు ఉన్నాయి. ఇక ఉట్నూర్‌లో ఫూలాజీబాబా, నిర్మల్‌లో పంచశీల్‌, భైంసాలో జీపీలడ్డా, ఆసిఫాబాద్‌లో శ్రీనిధి, మంచిర్యాలలో ఎస్‌ఆర్‌కేఎం డీఎడ్‌ కళాశాలలు కొనసాగుతున్నాయి. వీటిలో ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో కలిపి వంద చొప్పున 600 మంది విద్యార్థులు చదువుతున్నారు. మొత్తంగా 900 మంది విద్యార్థులు డీఎడ్‌ కోర్సు చేస్తున్నారు.

లెక్చరర్లు లేకుండానే..

ఉమ్మడి జిల్లా పరిధిలో చాలా కళాశాలల్లో పూర్తిస్థాయిలో సిబ్బంది లేకుండానే కొనసాగిస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రిన్సిపాల్‌తో పాటు ఎనిమిది మంది లెక్చరర్లను నియమించుకోవాలి. అయితే ఒకరిద్దరితో విద్యాబోధన చేయించి మమ అనిపిస్తున్నారనే విమర్శలున్నాయి. దీంతో విద్యార్థులు స్వతహాగా చదువుకొని పరీక్షలు రాస్తున్నారే తప్పా వారు పూర్తిస్థాయిలో జ్ఞానం పొందలేకపోతున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు ‘మామూలు’గా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అయితే ఈ అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు ఛాత్రోపాధ్యాయులతో పాటు లెక్చరర్లకు ఫేషియల్‌ అటెండెన్స్‌ సిస్టమ్‌ అమలు చేయాలని నిర్ణయించారు.

ఎఫ్‌ఆర్‌ఎస్‌ అమలుకు ఏర్పాట్లు

ఎస్‌సీఈఆర్టీ ఆదేశాల మేరకు ప్రభుత్వ డైట్‌తో పాటు ఉమ్మడి జిల్లా పరిధిలోని డీఎడ్‌ కళాశాలల్లో త్వరలో ఫేషియల్‌ అటెండెన్స్‌ సిస్టమ్‌ అమలుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే విద్యార్థులు, లెక్చరర్లు, సిబ్బంది వివరాలను ఎస్‌సీఈఆర్టీకి పంపించాం. విద్యార్థులు క్రమం తప్పకుండా తరగతులకు హాజరు కావాలి. లేకుంటే పరీక్షలకు అనుమతించబడదు. ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం. అలాగే ప్రైవేట్‌ కళాశాలలను తనిఖీ చేస్తున్నాం. – రవీందర్‌ రెడ్డి,

ప్రభుత్వ డైట్‌ కళాశాల ప్రిన్సిపాల్‌, ఆదిలాబాద్‌

తరగతులకు ఎగనామం..

ఈ కళాశాలల్లో ఆ జిల్లాతో పాటు ఇతర జిల్లాల కు చెందిన విద్యార్థులు చదువుతున్నారు. ప్రభు త్వ డైట్‌తో పాటు ఉమ్మడి జిల్లా పరిధిలోని జిల్లాల్లో గల ఒకట్రెండు కళాశాలల్లో విద్యార్థులు ప్రతిరోజు వచ్చే విధంగా ఆ యాజమాన్యాలు కఠినంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. మిగతా కళాశాలల్లో తరగతులకు గైర్హాజరైతే వారి నుంచి డబ్బులు తీసుకుంటున్నట్లు సమాచా రం. హాజరు వేసేందుకు రూ.20వేలు, రికార్డుల కోసం రూ.10వేలు, పరీక్షల సమయంలో మరో రూ.10వేల చొప్పున తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పాఠశాల మాదిరిగానే డీఎడ్‌ తరగతులు కొనసాగుతాయి. ప్రథమ సంవత్సరంలో 40 రోజులు, ద్వితీయ సంవత్సరంలో 60 రోజుల పాటు పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు తరగతులు బోధించాల్సి ఉంటుంది. అలాగే బోధించిన విషయాలపై రికార్డులు రాయాలి. కానీ డబ్బులు ముట్టజెప్పిన వారికి కొన్ని ప్రైవేట్‌ యాజమాన్యాలు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నాయి. వార్షిక పరీక్షల సమయంలో సైతం డబ్బులు తీసుకొని పరీక్షలు రాయిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
డుమ్మాలకు చెక్‌1
1/1

డుమ్మాలకు చెక్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement