సమగ్ర సర్వే సక్సెస్
● గ్రామీణ ప్రాంతాల్లో వందశాతం.. ● పట్టణ ప్రాంతాల్లో 97 శాతం సర్వే పూర్తి ● జిల్లాలో మొత్తం 1,62,921 కుటుంబాల వివరాలు సేకరణ
ఆసిఫాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే జిల్లాలో విజయవంతమైంది. ఈ నెల 6 నుంచి ప్రారంభమైన సర్వే ప్రక్రియ డిసెంబర్ 1 వరకు పూర్తి చేయాల్సి ఉంది. బుధవారం వరకు గ్రామీణ ప్రాంతాల్లో వందశాతం పూర్తి కాగా, అర్బన్ ప్రాంతంలో 97 శాతం పూర్తయింది. సర్వేలో ఎన్యుమరేటర్లకు కొంతమంది పూర్తి సమాచారం ఇవ్వగా, మరి కొంతమంది పాక్షికంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. కుటుంబం సామాజిక స్థితిగతులు, రాజకీయ, ఆర్థికపరమైన వివరాలు సర్వే నమూనాలో ఉండగా.. కేవలం కులం, మతం, వృత్తి వివరాలు చెప్పేందుకే చాలామంది ఆసక్తి కనబరిచారు. ముందుగా అధికారులు గ్రామీ ణ ప్రాంతాల్లో 1,42,846 కుటుంబాలను గుర్తించగా ఇప్పటివరకు 1,42,667 కుటుంబాల వివరాలు సేకరించారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో 20,778 కుటుంబాలను గుర్తించి 20,254 కుటుంబాల సర్వే పూర్తిచేశారు. బెజ్జూర్, పెంచికల్‌పేట్ మండలాల్లో 99 శాతం, మిగిలిన మండలాల్లో వందశాతం వివరాల సేకరణ పూర్తికావడంతో గ్రామీణ ప్రాంతాల్లో వందశాతం, పట్టణ ప్రాంతాల్లో 97 శాతం సర్వే పూర్తయినట్లు అధికారులు ప్రకటించారు.
వడివడిగా ఆన్‌లైన్
జిల్లావ్యాప్తంగా 1,292 మంది ఎన్యుమరేటర్లు, 153 మంది సూపర్‌వైజర్లు సర్వేలో పాల్గొన్నారు. ఒక్కో ఎన్యుమరేటర్ ప్రతిరోజూ సుమారు 150 గృహాలు సర్వే చేశారు. సేకరించిన వివరాలను ఆయా మండల కేంద్రాల్లోని మండల పరిషత్ కార్యాలయాలో ప్రత్యేక వెబ్‌సైట్‌లో వేగంగా నమోదు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 450 మంది డాటా ఎంట్రీ ఆపరేటర్లు ఈ నమోదు ప్రక్రియలో పాల్గొంటున్నారు. ఇప్పటివరకు 17 వేల కుటుంబాల వివరాలు వెబ్‌సైట్‌లో నమోదు చేశారు.
టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు
కుటుంబ సమగ్ర సర్వే ప్రక్రియ జిల్లాలో బుధవారంతో పూర్తయింది. ఈ క్రమంలో ఎవరైనా సర్వే వివరాలు తెలపని పక్షంలో ఆయా మండలాల్లోని ఎంపీడీవో, తహసీల్దార్ కార్యాలయంలో వివరాలు సమర్పించవచ్చని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే సర్వే సిబ్బంది, ఎన్యుమరేటర్లు పలుమా ర్లు గుర్తించిన ఇళ్లకు వెళ్లగా కొన్ని ప్రాంతాల్లో తాళాలు వేసి ఉన్నాయి. కొందరు ఇప్పటికీ అందుబాటులోకి రాని నేపథ్యంలో వారి కోసం ప్రభుత్వం టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసింది. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూం నం.63046 86505కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వొచ్చని, ఎన్యుమరేటర్లు వివరాలు సేకరిస్తారని జిల్లా ప్రణాళిక అధికారి చిన్న కోట్యానాయక్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment