బెజవాడలో ప్రధాని మోదీ రోడ్‌షో | Sakshi
Sakshi News home page

బెజవాడలో ప్రధాని మోదీ రోడ్‌షో

Published Thu, May 9 2024 8:20 AM

బెజవా

లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడలో ప్రధాని నరేంద్రమోదీ బుధవారం రాత్రి రోడ్‌షో చేశారు. గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ వచ్చిన ఆయన ఎంజీ రోడ్డులో పీవీపీ మాల్‌ నుంచి బెంజిసర్కిల్‌ వరకూ రోడ్‌షో నిర్వహించారు.రాత్రి 7గంటలకు ప్రారంభమైన రోడ్డు షో 8గంటల వరకు కొనసాగింది. ఓపెన్‌టాప్‌ జీప్‌లో చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లతో కలిసి నరేంద్రమోదీ బెంజిసర్కిల్‌ వరకూ ప్రజలకు, చేతులు ఊపుతూ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. ఆయన ఎలాంటి ప్రసంగాలు చేయలేదు. ప్రధాని మోదీ రోడ్‌షో నేపథ్యంలో పోలీసులు పూర్తిస్థాయిలో సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఐదు వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.

జెండాలు మేమే సప్లై చేయాలా..!

విజయవాడస్పోర్ట్స్‌: మోదీ రోడ్‌ షోకు జనాల తరలింపుతో పాటు బీజేపీ జెండాలు, కండువాలు, టోపీలు సైతం సప్లై చేసే భారాన్ని పూర్తిగా టీడీపీ నాయకులు ఎత్తుకున్నారు. ఇందిరాగాంధీ స్టేడియం వద్ద పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు బీజేపీ జెండాలు పట్టుకుని నడుస్తూ.. పార్టీ నాయకులు కనీసం జెండాలు కూడా తెచ్చుకోలేరా అవి కూడా మేమే సప్లై చేయాలా అంటూ నిట్టూర్చారు.

చంద్రబాబు రాజకీయ అంతమే.. పేదల పంతం

గాంఽధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును రాజకీయంగా అంతం చేయడమే పేదల పంతమని దళిత ప్రజా సంఘాల జేఏసీ పేర్కొంది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీకి మద్దతుగా నిలవాలని దళిత ప్రజా సంఘాల జేఏసీ నిర్ణయించింది. బుధవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో దళిత ప్రజా సంఘాల జేఏసీ సమావేశం జరిగింది. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ఫ్రాన్సిస్‌ మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగించారన్నారు. వైఎస్‌ జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత దళిత, గిరిజన, క్రైస్తవ, ముస్లిం మైనార్టీలపై ఉందన్నారు. పేదలు ఎవ్వరూ బాబును నమ్మి మోసపోవద్దన్నారు. సమతా సైనిక్‌ దళ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కంచర్ల చిట్టిబాబు మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ 2019 ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశారన్నారు. విజయవాడ నగరం నడి ఒడ్డున 125 అడుగుల డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేసి ఆత్మగౌరం పెంచారన్నారు. 2024 ఎన్నికల్లో 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామని బీజేపీ నాయకులు బహిరంగంగానే ప్రకటిస్తున్నారని, అటువంటి వారితో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుందన్నారు. దళితులను అడుగడుగునా అవమానించిన చంద్రబాబును ఓడించడానికి జేఏసీ ప్రతినిధులు స్టార్‌ క్యాంపయినర్లుగా పని చేస్తామన్నారు. జేఏసీ ప్రతినిధులు ఊసల ప్రసాద్‌, గెత్తం విజయకుమార్‌, పెనమాల నాగకుమార్‌, రవికుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

అభయాంజనేయుడి సన్నిధిలో జైపూర్‌ బీజేపీ ఎమ్మెల్యే

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌: నరసాపురం పార్లమెంట్‌ స్థానానికి బీజేపీ ఎన్నికల పరిశీలకుడిగా వ్యవహరిస్తున్న జైపూర్‌ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌ ధన్‌ఖడ్‌ బుధవారం జంక్షన్‌లో ప్రసిద్ధ అభయాంజనేయ స్వామి దేవస్థానాన్ని సందర్శించారు. ఆంజనేయుడికి ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక వ్యాపారులతో మాట్లాడారు.

బెజవాడలో ప్రధాని మోదీ రోడ్‌షో
1/1

బెజవాడలో ప్రధాని మోదీ రోడ్‌షో

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement