సంక్షిప్త సవరణకు సహకరించండి
కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ, పోలింగ్ కేంద్రాల హేతు బద్ధీకరణలో రాజకీయ పార్టీల ప్రతినిధులు సంపూర్ణ సహకారం అందించాలని కృష్ణా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సోమవారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ బూత్ స్థాయి అధికారులతో ఇంటింటి పరిశీలన కార్యక్రమం ఆగస్టు 21వ తేదీ నుంచి మొదలైందన్నారు. సెప్టెంబర్ 29వ తేదీ వరకు 99.11 శాతం పూర్తయ్యిందన్నారు. జిల్లాలో 15,39,299 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో 4,698 మంది ఓటర్లు లేరని, 1803 మంది ఓటర్లు వేరే ప్రాంతానికి వెళ్లారని, 4,426 మంది ఓటర్లు చనిపోయారన్నారు. జిల్లాలో ఫారం–6, 7, 8కు సంబంధించి 4,25,272 క్లయిమ్‌లు రాగా 4,20,849 క్లయిమ్‌లు పరిష్కరించామన్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని తొమ్మిది పోలింగ్ కేంద్రాల నామకరణంలో మార్పు చేస్తూ ప్రతిపాదనలు పంపుతున్నామన్నారు. గన్నవరం, పెడనలో ఒకటి, మచిలీపట్నంలో మూడు, పెనమలూరులో ఆరు చోట్ల కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామన్నారు. కృష్ణా గుంటూరు శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గానికి పబ్లిక్ నోటీస్ జారీ చేశామని, అక్టోబర్ 16వ తేదీ వరకు ఉంటుందని, రెండో నోటీసు 25వ తేదీ వరకు ఉంటుందన్నారు. పట్టభద్రులు ఓటర్లుగా పేరు నమోదు చేసుకోవడానికి నవంబర్ 6వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. నవంబర్ 23వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తామన్నారు. డీఆర్వో చంద్రశేఖరరావు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు శ్రీదేవి, బాలసుబ్రహ్మణ్యం, పార్టీల ప్రతినిధులు కొడాలి శర్మ, పంతం వెంకటగజేంద్రరావు, బండ్రెడ్జి రామకృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment