దాళ్వాకు నీరివ్వాలని రైతులు ధర్నా
బంటుమిల్లి: బంటుమిల్లి ప్రధాన పంట కాలువ పరిధిలోని సాగు భూములకు రెండో పంటగా దాళ్వా(రబీ)కు సాగునీరు ఇవ్వాలని కోరుతూ రైతులు ధర్నా చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లోని తీరగ్రామ రైతులు స్థానిక లక్ష్మీపురం సెంటర్లో జరిగిన ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భగా రైతు సంఘ జిల్లా కార్యదర్శి గౌరిశెట్టి నాగేశ్వర రావు మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా తీర ప్రాంతంలో దాళ్వా లేక భూములు చౌడుబారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీని కారణంగా ఏటా సార్వా దిగుబడులు తగ్గి రైతులు నష్టపోతున్నారని తెలిపారు. రైతులు పండించే ఒక పంట తుపానులు, అధిక వర్షాలపాలై అప్పులపాలవుతున్నారని వివరించారు. రిజర్వాయర్లలో పూర్తి స్థాయిలో జలాలు ఉన్నా ఏదో ఒక సాకుతో రెండో పంటకు నీరు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. పాలకులు, అధికారులు వెంటనే స్పందించి బంటుమిల్లి ప్రధాన కాలువ పరిధిలో దాళ్వాకు నీరు ఇవ్వాలని రైతులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. రైతుల సహకారంతో దాళ్వా నీటి కోసం ఆందోళన ఉధృతం చేస్తామని నాగేశ్వరరావు హెచ్చరించారు. ఈ ధర్నాలో రైతు సంఘ నాయకులతోపాటు బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లోని పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment