నిర్ణీత గడువులోగా సమస్యలకు పరిష్కారం
కృష్ణా ఎస్పీ గంగాధరరావు
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఎస్పీ ఆర్. గంగాధరరావు అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం మీకోసం కార్యక్రమంలో బాధితుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులకు సిబ్బంది సహాయం చేసి ప్రశాంతంగా వారి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమస్య తీవ్రత ఎలా ఉన్నా చట్టపరిధిలో పూర్తిస్థాయి విచారణ జరిపి నిర్ణీత గడువులోపు పరిష్కారం అందించేలా చూడాలన్నారు.
వచ్చిన అర్జీల్లో కొన్ని..
●మచిలీపట్నానికి చెందిన ఓ వివాహిత తనకు వివాహ సమయంలో తన తల్లిదండ్రులు కట్నంగా ఇచ్చిన వ్యవసాయ భూమిని తన పేరున రిజిస్ట్రేషన్ చేయడానికి అన్నదమ్ములు అడ్డుగా నిలుస్తున్నారని అదేమని అడిగితే భౌతికంగా దాడికి పాల్పడుతున్నారని తనకు న్యాయం చేయాలని కోరుతూ ఫిర్యాదు చేశారు.
●తాము ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉండగా తన దగ్గర బంధువులు ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికి రూ. 2 లక్షలు తీసుకున్నారని ఉద్యోగం గురించి అడుగుతుంటే సమాధానం చెప్పకపోగా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని తనకు న్యాయం చేయాలని తోట్లవల్లూరుకు చెందిన ఓ యువకుడు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment