చిలకలపూడి(మచిలీపట్నం): వ్యర్థాల నుంచి విద్యార్థులు తయారుచేసిన కళాకృతుల ప్రదర్శనకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదేశించారు. తన చాంబర్‌లో విద్య, మునిసిపల్, గిరిజన తదితర శాఖల అధికారులతో విద్యార్థుల కళా ప్రదర్శన (ఆర్ట్ ఎగ్జిబిషన్) కార్యక్రమంపై అధికారులతో కలెక్టర్ సోమవారం సమీక్షించారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ రెండో తేదీన గాంధీ జయంతి సందర్భంగా స్థానిక నోబుల్ కళాశాల గ్రౌండ్స్‌లో విద్యార్థులు వ్యర్థాల నుంచి తయారు చేసిన కళా కృతులను ప్రదర్శించనున్నారని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులు ఒక కేటగిరీ, ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ, టీటీసీ విద్యార్థులు మరొక కేటగిరీగా ఏర్పడి తయారుచేసిన తమ కళాకృతులను ప్రదర్శిస్తారన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులతో పాటు తోడ్పాటు అందించిన ఉపాధ్యాయులకు అదే రోజు నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందిస్తామన్నారు. వ్యర్థాల నిర్వహణపై విద్యార్థులతో పాటు ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ బాలాజీ తెలిపారు. ఆ రోజు నిర్వహించే కార్యక్రమానికి సాధారణ పౌరులందరూ విచ్చేసి ప్రదర్శనను తిలకించి విద్యార్థులను అభినందించాలని కోరారు. ఈ సమావేశంలో డీఈఓ తాహెరా సుల్తానా, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి ఝాన్సీలక్ష్మి, మచిలీపట్నం మునిసిపల్ కమిషనర్ బాపిరాజు, గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఫణిధూర్జటి, మార్కెటింగ్ ఏడీ నిత్యానంద్, మండల విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment