చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయండి
మంత్రి నారాయణ
చిలకలపూడి(మచిలీపట్నం): నగరంలో బుధవారం జరిగే ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన విజయవంతం చేయాలని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి పి.నారాయణ కోరారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఆయన మంగళవారం మచిలీపట్నంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. మీడియాతో మాట్లాడుతూ.. మచిలీపట్నం మునిసిపల్ కార్పొరేషన్‌లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు సీఎంకు వివరించాల్సిన అంశాలను సిద్ధం చేశామన్నారు. పార్టీలకు అతీతంగా అక్రమ కట్టడాల విషయంలో ముందుకెళ్తామన్నారు. ఆక్రమణల ద్వారా ప్రజలకు అనేక ఇబ్బందులు వస్తున్నాయని పేర్కొన్నారు. బుడమేరు ఆక్రమణతోనే విజయవాడకు భారీ వరదలు వచ్చాయన్నారు. అందుకే ఆపరేషన్ బుడమేరు చేపట్టామన్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులను ఆక్రమించిన వారు స్వచ్ఛంగా ఖాళీ చేయాలన్నారు. అక్రమ కట్టడాల విషయంలో ఎవరినైనా ఉపేక్షించేది లేదన్నారు.
సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
చిలకలపూడి(మచిలీపట్నం): ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం మచిలీపట్నంలో పర్యటిస్తున్న దృష్ట్యా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారు లను కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఎస్పీ ఆర్.గంగాధరరావు, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి ఏర్పాట్లపై అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వస్తున్నారని పేర్కొన్నారు. తొలుత నేషనల్ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుని, అక్కడి నుంచి కళాశాల బయట జరిగే స్వచ్ఛతా సేవ సేవా కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. అనంతరం డంపింగ్ యార్డును పరిశీ లించి మూడు స్తంభాల సెంటరు మీదుగా కోనేరుసెంటర్ నుంచి టీటీడీ కల్యాణ మండపానికి చేరుకుని సఫాయి కర్మచారి పారిశుద్ధ్య కార్మికులతో ముఖాముఖిలో పాల్గొంటారని వివరించారు. పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులను సంప్రదించి ముఖ్యమంత్రిని కలిసే ప్రముఖుల జాబితాను సిద్ధం చేసుకోవాలన్నారు. అన్ని ప్రదేశాల్లోనూ గట్టి పోలీస్‌బందోబస్తు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్వో చంద్రశేఖరరావు, జెడ్పీ సీఈఓ కన్నమనాయుడు, డీపీఓ అరుణ, ఆర్‌అండ్‌బీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ లోకేష్, మునిసిపల్ కమిషనర్లు బాపిరాజు, గోపాలరావు, వెంకటేశ్వరరావు, కాలుష్య నియంత్రణ మండల ఈఈ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment