చోరీ ముఠా గుట్టురట్టు
కంకిపాడు: బైక్‌ల చోరీ ముఠా గుట్టు రట్టయ్యింది. బైక్‌ల చోరీలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను కంకిపాడు పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఐదు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీసుస్టేషన్ ప్రాంగణంలో ఎస్‌ఐ డి.సందీప్ మంగళవారం ఈ కేసు వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. మండలంలోని వివిధ గ్రామాల్లో బైక్ చోరీలు జరుగుతున్నాయని వస్తున్న ఫిర్యాదులతో ఎస్పీ ఆర్.గంగాధర్‌రావు ఆదేశాలతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేశారు. గతంలో ఈ బృందం ఆరు బైక్‌లను స్వాధీనం చేసుకుంది. గత నెలలో మళ్లీ బైక్ చోరీలు జరగటంతో చోరీ ముఠా కదలికలపై పోలీసులు నిఘా ఏర్పాటుచేశారు. కంకి పాడు మండలం ఉప్పలూరు గ్రామానికి చెందిన చింతపల్లి సాయికిరణ్, దేవరపల్లి సందీప్, చిట్టి కల్యాణం, విజయవాడ గిరిపురం ప్రాంతానికి చెందిన వక్కలగడ్డ రాజేష్ ఈడుపుగల్లు గ్రామ శివారులో అనుమానాస్పదంగా సంచరి స్తుండగా పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారికి బైక్ చోరీలతో సంబంధం ఉన్నట్లు తేలింది. ఈడుపుగల్లులో ఓ బడ్డీ కొట్టులో చోరీ చేసి ఘటనలోనూ ఈ నలుగురు నిందితులుగా గుర్తించారు. వారి వద్ద ఐదు బైక్‌లు, చోరీ చేసిన కొన్ని వస్తువులు, రూ.4 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. నిందితుల అరెస్టులో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్‌ఐ సందీప్, సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. ఉప్పలూరుకు చెందిన చింతపల్లి సాయికిరణ్ విజయవాడలో ఉన్న రోజుల్లో గిరిపురానికి చెందిన వక్కలగడ్డ రాజేష్‌తో పరిచయం ఉంది. ఉప్పలూరు వచ్చి స్థిరపడ్డ తరువాత ఈ నలుగురు జట్టుగా ఏర్పడి వ్యసనాలకు బానిసలై చోరీలను వృత్తిగా ఎంచుకున్నట్లు ఎస్‌ఐ సందీప్ తెలిపారు.
అమెరికాలో నున్న విద్యార్థిని గుండెపోటుతో మృతి
నున్న(విజయవాడరూరల్): ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన నున్న గ్రామానికి చెందిన అవుతు దివ్య (23) గుండె పోటుతో మృతి చెందారు. ఈ ఘటన గ్రామంలో విషాదం నింపింది. స్థానికుల కథనం మేరకు.. అవుతు సురేంద్రరెడ్డి, స్వప్న దంపతుల పెద్ద కుమార్తె దివ్య బీబీఏ పూర్తి చేసి అమెరికాలో మెరసర్ యూనివర్సిటీలో ఎంఎస్ చేసేందుకు ఏడాది క్రితం వెళ్లారు. అమెరికాలోని అట్లాంట సిటీలో నివసిస్తున్న దివ్య ఆదివారం రాత్రి గుండె పోటుతో మృతి చెందారు. ఉన్నత చదువులు పూర్తి చేసుకొని మంచి ఉద్యోగంలో స్థిరపడుతుందని ఆశపడిన దివ్య తల్లిదండ్రులు కుమార్తె మృతి చెందిన వార్త తెలియగానే కుప్పకూలి పోయారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దివ్య మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చే విషయాన్ని కుటుంబ సభ్యులు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ వద్ద ప్రస్తావించగా అమెరికాలో తన కార్యాలయం సిబ్బందితో మాట్లాడి సహకరించారు.
నలుగురు బైక్ దొంగల అరెస్టు ఐదు బైక్‌లను స్వాధీనం చేసుకున్న పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment