ఇంద్ర వైభవం | - | Sakshi
Sakshi News home page

ఇంద్ర వైభవం

Published Wed, Oct 2 2024 3:12 AM | Last Updated on Wed, Oct 2 2024 3:12 AM

ఇంద్ర

ఇంద్ర వైభవం

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలకు ముస్తాబైంది. గురువారం నుంచి ప్రారంభమయ్యే శరన్నవరాత్రి ఉత్సవాల్లో తొలి రోజున అమ్మవారు శ్రీ బాలాత్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. తెల్లవారుజామున అమ్మవారికి స్నపనాభిషేకం అనంతరం విశేష అలంకరణ, పూజా కార్యక్రమాల తర్వాత ఉదయం 9 గంటలకు భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు.

ప్రత్యేక బస్సులు..

ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఒడిశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని విశేష అలంకారాలలో దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌ల నుంచి దేవస్థానం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వీఐపీ టికెట్లతో పాటు రూ. 300, రూ. 100 క్యూలైన్లతో పాటు సర్వ దర్శనం ఏర్పాటు చేసింది. ఒకే దఫా భక్తులు 5 క్యూలైన్ల ద్వారా అమ్మవారిని దర్శించుకునేలా ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లు చేశారు. వీవీఐపీలకు ప్రత్యేక సమయంతో పాటు వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించారు.

ఆర్జిత సేవలకు డిమాండ్‌..

దసరా ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారికి ఖడ్గమాలార్చన, విశేష చండీహోమం, లక్ష కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన నిర్వహించనున్నారు. మహా మండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తి వద్ద ఖడ్గమాలార్చన, ప్రత్యేక లక్ష కుంకుమార్చన జరుగుతుంది. ఆలయ ప్రాంగణంలోని మల్లికార్జున మహామండపం వద్ద ప్రత్యేక శ్రీచక్రనవార్చన, రాధాకృష్ణ విగ్రహం వద్ద నూతనంగా నిర్మించిన యాగశాలలో చండీహోమం నిర్వహిస్తారు.

మూడు మార్గాల్లో కొండ దిగువకు..

అమ్మవారిని దర్శించుకున్న అనంతరం భక్తులు కొండ దిగువకు చేరేందుకు మూడు మార్గాలను ఏర్పాటు చేశారు. మల్లేశ్వర స్వామి వారి ఆలయం మెట్లతో పాటు ఈ దఫా మహా మండపంలోని క్యూలైన్ల ద్వారా భక్తులను కొండ దిగువకు అనుమతిస్తారు. మహామండపం ఎదుట నూతన భవన నిర్మాణం జరుగుతుండటంతో మల్లేశ్వర స్వామి వారి ఆలయం వద్ద మెట్లను తొలగించారు. వాటి స్థానంలో ఐరన్‌ మెట్లను ఏర్పాటు చేయగా, వాటిపై సాధ్యమైనంత తక్కువ మందినే అనుమతించాలని దేవస్థానం నిర్ణయించింది. అత్యవసర పరిస్థితులలో మహా మండపం లిఫ్టు పక్కనే ఉన్న మెట్లను సైతం వినియోగంలోకి తీసుకురావాలని ఆలయ అధికారులు నిర్ణయించారు.

కొలిక్కిరాని పనులు..

అమ్మవారి దర్శనానికి భక్తులు విచ్చేసే క్యూలైన్లు కొన్ని చోట్ల ఇంకా పనులు కొనసాగుతున్నాయి. కుమ్మరి పాలెం వైపు నుంచి వచ్చే భక్తులు క్యూలైన్‌లో కలిసేందుకు ఏర్పాటు చేయాల్సి ఉంది. దుర్గాఘాట్‌, ఘాట్‌రోడ్డులోని మొదటి మలుపు వద్ద రిటైనింగ్‌ వాల్‌ విరిగిపడిన ప్రదేశంలో క్యూలైన్లు నిర్మించాల్సి ఉంది. అయితే బుధవారం మధ్యాహ్నానికి క్యూలైన్లు, అక్కడక్కడ మిగిలి ఉన్న పనులు కూడా పూర్తవుతాయని అధికారులు పేర్కొంటున్నారు.

అన్న ప్రసాద వితరణ ఇలా..

దసరా ఉత్సవాలలో అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులను నిరంతరం ప్రసాదాలను పంపిణీ చేయాలని దేవస్థానం నిర్ణయించింది. ఇందుకు గాను మహామండపం ఎదుట నూతనంగా నిర్మిస్తున్న భవనం వద్ద తాత్కాలిక షెడ్డును ఏర్పాటు చేసింది. ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్విరామంగా అల్పాహారం, భోజనం వితరణ చేయనుంది. రోజుకు కనీసం 20 వేల మందికి ప్రసాద వితరణ చేసేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు.

25 లక్షల లడ్డూల తయారీ..

దసరా ఉత్సవాలలో అమ్మవారిని దర్శించుకునేందుకు విచ్చేసే భక్తుల కోసం దేవస్థానం 25 లక్షల లడ్డూలను తయారు చేసేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం బుద్ధా వారి గుడి వెనుక భాగంలో ఉన్న లడ్డూ పోటుతో పాటు కనకదుర్గనగర్‌ ఏనుగు షెడ్డులో లడ్డూలను తయారు చేసి ప్యాకింగ్‌ చేస్తున్నారు. మంగళవారం నుంచి ఉత్సవాలకు అవసరమైన లడ్డూలను తయారు చేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఉత్సవాలలో తొలి రోజైన బుధవారం నాటికి నాలుగు లక్షల లడ్డూలను సిద్ధం చేస్తున్నామని ఆలయ ఏఈవో పేర్కొన్నారు. భక్తులకు ప్రసాదాలను విక్రయించేందుకు గాను కనకదుర్గనగర్‌లో 11 కౌంటర్లతో పాటు బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌లలో ఒక్కో కౌంటర్‌తో పాటు ఘాట్‌రోడ్డులో మరో కౌంటర్‌ ఏర్పాటు చేశారు.

‘అంబ’రాన్నంటే సంబరం

రేపటి నుంచి 12 వరకూ వేడుకలు తొలి రోజు శ్రీబాలాత్రిపుర సుందరీ దేవిగా దుర్గమ్మ ఉదయం 9 గంటల నుంచి దర్శనం వినాయకుడి గుడి నుంచి క్యూలైన్లు మహామండపం దిగువన అన్నదానం

డిజిటల్‌ డ్యూటీ పాస్‌లు

దసరా ఉత్సవాలలో ఈ ఏడాది డిజిటల్‌ డ్యూటీ పాస్‌లను దేవస్థానం జారీ చేసింది. అమ్మవారి ఆలయంలోని అధికారులు, ఉద్యోగులతో పాటు కింది స్థాయి ఉద్యోగులకు సైతం డిజిటల్‌ కార్డులను జారీ చేశారు. ఆలయ ఉద్యోగులతో పాటు పోలీసు, రెవెన్యూ ఇతర ప్రభుత్వ శాఖలతో పాటు మీడియా ప్రతినిధులకు సైతం ఇవే కార్డులు జారీ చేస్తున్నారు. ఈ ఏడాది డ్యూటీ పాస్‌లపై దర్శనాలను పూర్తిగా అరికట్టేందుకు దేవస్థానం డిజిటల్‌ కార్డులను జారీ చేస్తోంది. డిజిటల్‌ కార్డుపై సంబంధిత ఉద్యోగి ఫొటోతో పాటు ఇతర వివరాలను ప్రింట్‌ చేస్తారు. డిజిటల్‌ కార్డును జిరాక్స్‌ తీసినా, నకిలీ కార్డు తయారు చేసినా సంబంధిత ఉద్యోగి వివరాలు తెలిసేలా ఈ కార్డులు రూపొందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ఇంద్ర వైభవం1
1/1

ఇంద్ర వైభవం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement