కోలుకోనివ్వని వరద
సాక్షి, మచిలీపట్నం: కర్షకుడిపై ప్రకృతి కనెర్రజేస్తోంది. నేల తల్లిని నమ్ముకున్న రైతన్నను విపత్తు చిత్తు చేస్తోంది. ఆరుగాలం కష్టపడి పండిస్తున్న పంటను మధ్యలోనే చిదిమేస్తోంది. పంట ఖర్చులు, పెట్టుబడి, అన్నదాతల కష్టం కూడా నీటిపాలవుతోంది. 2023 డిసెంబర్‌లో వచ్చిన మిచాంగ్ వేల మందిని నీట ముంచితే.. ఇటీవలే వచ్చిన వరదలు పంటలను ఊడ్చేశాయి. ఒకే ఏడాది రెండుసార్లు కోలుకోలేని దెబ్బలు తాకడంతో వ్యవసాయం అంటేనే వద్దనుకునేంత ఆందోళనకు గురవుతున్నాడు. రోజురోజుకు పెరిగిపోతున్న పెట్టుబడి ఖర్చులు, కౌలు, ఎరువులు, క్రిమి సంహారక మందుల ధరలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న అన్నదాత.. ప్రకృతి ప్రతాపంతో అల్లాడుతున్నాడు.
మిచాంగ్‌తో తొలి దెబ్బ..
గత ఏడాది డిసెంబర్‌లో వచ్చిన మిచాంగ్ తుపాను 93వేల మందికి పైగా రైతులపై తీవ్ర ప్రభావం చూపింది. ఇందులో 92,318 మంది రైతులు 58,835.56 హెక్టార్లలో వ్యవసాయ పంటలు (వరి, పత్తి, మినుము, చెరుకు, వేరుశనగ) నష్టపోగా.. 1,209 మంది రైతులు 462.42 హెక్టార్లలో ఉద్యాన పంటలు నష్టపోయారు. వీరిని ఆదుకునేందుకు 2024 మార్చి 6న గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల చేశారు. వ్యవసాయ పంటకు రూ.99.90 కోట్లు, ఉద్యాన పంటలకు రూ.1.12 కోట్లు, మొత్తం 93,527 మంది రైతులకు రూ.101.02 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ బ్యాంక్ ఖాతాలలో జమ చేశారు.
ఏడాదిలోపు అన్నదాతకు రెండు దెబ్బలు 2023 డిసెంబర్‌లో తుపానుతో 58,835 హెక్టార్లలో పంట నష్టం రూ.115.78కోట్లు నష్టపోయిన 93,500 మంది రైతులు ఇటీవల వరదలతో నీట మునిగిన 48,641 హెక్టార్ల సాగు పది రోజులు నీటిలో ఉండడంతోకుళ్లిన పంటలు రూ.493.06కోట్ల నష్టం జరిగినట్లు కేంద్రానికి నివేదిక ప్రకృతి దెబ్బలతో కుదేలవుతోన్న అన్నదాతలు
మిచాంగ్ నుంచి తేరుకొని.. ఆశల ఖరీఫ్‌లో అన్నదాతలు సాగుచేసిన పంటను బుడమేరు, కృష్ణా వరదలు ఊడ్చేసింది. ఎగువ కురిసిన అధిక వర్షాలతో కృష్ణా నదితో పాటు బుడమేరుకు భారీ వరదలు వచ్చాయి. దీంతో జిల్లాలో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. కేంద్ర బృందం వదర ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, జిల్లా అధికారుల నుంచి నివేదికలు స్వీకరించారు. ఈ లెక్కన జిల్లాలో మొత్తం 48,641 హెక్టార్లు ముంపునకు గురి కాగా 44,521 హెక్టార్ల వరి, వేరుశనగ, మినుములు, చెరుకు, పత్తి తదితర పంటలు, 4,070 హెక్టార్ల ఉద్యాన, 50 హెక్టార్ల పట్టు పంటలు దెబ్బతిన్నాయి. వరద తగ్గాక పంట నష్టం నమోదుపై దృష్టి పెట్టారు. రెవెన్యూ, వ్యవసాయం, ఉద్యాన అధికారులు పొలాలను పరిశీలించి నమోదు చేశారు. దీనికి మొత్తం రూ.493.06 కోట్ల నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా చేశారు. 44,521 హెక్టార్లలో వ్యవసాయ పంటలకు రూ.385.24 కోట్లు, 4,070 హెక్టార్ల ఉద్యాన పంటలకు రూ.107.82 కోట్ల అంచనా వేసి కేంద్ర బృందానికి నివేదిక ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment