భవానీ దీక్షల స్వీకరణ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దసరాను పురస్కరించుకుని పలువురు భక్తులు భవానీదీక్షలను స్వీకరించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశాకు చెందిన పలువురు భక్తులు మంగళవారం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని రావిచెట్టు వద్ద గురు భవానీల చేతుల మీదగా దీక్షలను స్వీకరించారు. అనంతరం మహామండపం వద్దకు అమ్మవారి కీర్తనలను ఆలపించడంతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. దీక్షలను దసరా పది రోజులు ఆచరిస్తామని, విజయ దశమి, ఏకాదశిన దీక్ష విరమణ చేస్తామని భవానీలు పేర్కొంటున్నారు.
‘చంద్రబాబు చెంపలు వాయించిన సుప్రీంకోర్టు’
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): తిరుపతి లడ్డూ వ్యవహారంలో సుప్రీంకోర్టు చంద్రబాబు చెంప వాయికొట్టిందని జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకుడు జడ శ్రవణ్‌కుమార్ అన్నారు. విజయవాడలోని ఆ పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల మనోభావాలతో కూటమి ప్రభుత్వం ఆడుకుంటోందన్నారు. ఐదేళ్లకు సరిపడా తప్పులను కూటమి ప్రభుత్వం కేవలం వంద రోజుల్లో చేసేసిందన్నారు. లడ్డూ వ్యవహారంలో కొన్ని పత్రికలు ఉన్నది ఉన్నట్లు రాయడం లేదదన్నారు. సుప్రీంకోర్టు చెప్పిన అంశాలను ప్రజలకు చేరవేయడం లేదన్నారు. కూటమి ప్రభుత్వాన్ని పొత్తిళ్లలో పెట్టి కాపాడుకొంటున్న ఆ మీడియాకు ఉగ్రవాదులకు తేడా ఉందా? అని ప్రశ్నించారు. కల్పిత కథలు అల్లి చూపించడంలో లోకేష్‌కి అవార్డ్ ఇవ్వొచ్చన్నారు. హోం మంత్రి వ్యవహారశైలి మార్చుకోవాలన్నారు. కాదంబరి కేసులో ప్రభుత్వ తీరును తప్పు పట్టారు. తాను తప్పు చేసినప్పుడు మాత్రమే ప్రాయశ్చిత్త దీక్షా చేస్తారని, పవన్ తప్పు చేశాడని ముందే తెలుసు కాబట్టి ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే కొలికపూడిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆయనను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
నెలాఖరులోగా పరిహారమివ్వాల్సిందే
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బుడమేరు వరదల్లో నష్టపోయిన ఆటోలకు నెలాఖరులోగా పరిహారం అందించాలని, లేని పక్షంలో రవాణా శాఖ మంత్రి కార్యాలయం ముట్టడిస్తామని విజయవాడ ఆటో వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు దోనేపూడి శంకర్ హెచ్చరించారు. వరదల్లో మునిగిన ఆటోలకు రూ. 50 వేల నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ లెనిన్ సెంటర్‌లో ఏఐటీయూసీ ఆధ్వర్యాన ఆటో కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో యూనియన్ గౌరవాధ్యక్షుడు దోనేపూడి శంకర్ మాట్లాడుతూ బుడమేరు వరద ముంపు వలన 4వేల ఆటోలు మునిగిపోయాయన్నారు. ఒక్కో ఆటోకు రూ.40వేలు పైబడి మరమ్మతులకు ఖర్చవుతోందన్నారు. ప్రభుత్వ నష్ట పరిహారం పెంచాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్ మాట్లాడుతూ విజయవాడ వరదలను జాతీయ విపత్తుగా మోదీ ప్రభుత్వం పరిగణించడంలో తాత్సారం చేస్తోందన్నారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి గూడేల జనార్దన్ మాట్లాడుతూ ఆటో కార్మికులకు రూ. 50వేలు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రైవేటు మద్యం షాపులకు నోటిఫికేషన్
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో ప్రైవేటు మద్యం షాపుల నిర్వహణ కోసం మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసినట్లు కృష్ణా జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ జి. గంగాధరరావు తెలిపారు. జిల్లాలో 123 షాపుల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామన్నారు. మచిలీపట్నం, అవనిగడ్డ, బంటుమిల్లి, మొవ్వ, గుడివాడ, నందివాడ, ఉయ్యూరు, గన్నవరం ఎకై ్సజ్ స్టేషన్ల పరిధిలో ఈ షాపులు ఉంటాయన్నారు. ప్రైవేటు షాపుల కోసం ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. 11వ తేదీ ఉదయం 8 గంటల నుంచి మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో డ్రా తీస్తామన్నారు. ఆయా మండలాలు, నగర పంచాయతీలు, మునిసిపల్ కార్పొరేషన్ల వారీగా లైసెన్స్ ఫీజులను నిర్ణయించామన్నారు. దాని ప్రకారం డ్రాలో షాపు పొందిన వారు 12వ తేదీ నుంచి 2026 సెప్టెంబర్ 30వ తేదీ వరకు షాపు నిర్వహించుకునేందుకు లైసెన్సు జారీ చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment