వైఎస్సార్ సీపీపై చంద్రబాబు కుయుక్తులు
చిలకలపూడి(మచిలీపట్నం): చంద్రబాబు, పవన్‌కల్యాణ్, మోదీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అభివృద్ధిపై ఆలోచించకుండా వైఎస్సార్ సీపీపై కుయుక్తులు పన్నుతోందని మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) ధ్వజమెత్తారు. మచిలీపట్నంలోని సబ్‌జైలులో సోషల్ మీడియా కార్యకర్తలను పరామర్శించిన అనంతరం సోమవారం మీడియాతో మాట్లాడారు. ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా డ్రోన్ షోలు, సీ ప్లేన్‌లు ఏర్పాటు చేసి ఆనందం పొందుతున్నారని వీటితో ఒరిగేదేంటని ప్రశ్నించారు. నాడు సీఎంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కట్టిన మెడికల్ కళాశాలలు, పాఠశాలల ఆధునికీకరణలో పోటీ పడి ఇంకా అద్భుతంగా తయారుచేయాలనే ఆలోచన చేయకుండా తల్లిదండ్రులపై భారం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీ ప్లేన్ పెట్టిన చోటల్లా దివాళా తీసిన సంగతి కూటమి నాయకులకు తెలియదా అన్నారు.
నేత, మైనార్టీలపై వేధింపులు, బెదిరింపులు
పేద కుటుంబాలకు చెందిన చేనేత, మైనార్టీలైన శ్యాంసుందర్, ఖాజా బాబాపై మూడు ప్రాంతాల్లో కేసులు నమోదు చేయడం బాధాకరమన్నారు. ఎల్లప్పుడూ కూటమి ప్రభుత్వమే ఉండదని ఆయన ఉద్యోగులను హెచ్చరించారు. గుడివాడ సీఐ శ్రీనివాసరావు, ఎస్సైలు ఆదిశేషు, శ్యామ్‌లు కార్యకర్తలను బెదిరిస్తున్నారన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్.. జగన్ పోలీసులను బెదిరిస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారని ఇటీవల ఆయన డీజీపీ, అధికారులను బెదిరించలేదా అని ఆయన ప్రశ్నించారు.
కాగిత బాబు పేరుతో వైఎస్సార్ సీపీ నాయకుల వ్యక్తిగత వ్యవహారాలతో పోస్టింగ్‌లు పెడుతున్నారని అది ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. చంద్రబాబునాయుడిలా ఏడవడం, నటించడం తమకు తెలియదని కేసులపై పోరాటం ఒక్కటే తమకు తెలుసని చెప్పారు. జగన్‌పై పోస్టులు పెట్టిన సోషల్ మీడియా కార్యకర్తలను దమ్ముంటే అరెస్టు చేయగలరా అని ఆయన అన్నారు. ఎన్ని కుయుక్తులు పన్నినా న్యాయ, రాజకీయ పోరాటం చేస్తామేగానీ భయపడబోమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్, నియోజకవర్గ ఇన్‌చార్జిలు ఉప్పాల రాము, దేవభక్తుని చక్రవర్తి ఇతర నేతలు పాల్గొన్నారు.
డ్రోన్లు, సీ ప్లేన్‌తో ప్రజలకు ఒరిగేదేమిటి? కార్యకర్తలపై చేస్తున్న వేధింపులపై న్యాయ, రాజకీయ పోరాటం మీడియాతో మాజీ మంత్రి పేర్ని నాని
Comments
Please login to add a commentAdd a comment