నేటి తరానికి స్ఫూర్తి అబుల్ కలాం
చిలకలపూడి(మచిలీపట్నం): మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలు, ఆలోచనలు నేటి తరానికి స్ఫూర్తి కావాలని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. మైనార్టీ సంక్షేమశాఖ, విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యాన జెడ్పీ సమావేశ మందిరంలో భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ 137వ జయంతిని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ జాతీయతను, సమగ్రతను పెంపొందించడానికి ఆజాద్ గొప్ప ఆలోచనలు, దూరదృష్టి ఉన్న మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఆయన విద్యారంగానికి చేసిన సేవలు ఎనలేనివన్నారు. ఐఐటీ వంటి జాతీయ ఉన్నత విద్యా సంస్థలు దేశంలో ఏర్పాటుకు ఆయన ఉన్నత ఆలోచనలే కారణమన్నారు. ఇంట్లోనే చదివి ఐదు భాషల్లో ప్రావీణ్యం పొందిన మహనీయుడని కొనియాడారు. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ జాతిపిత మహాత్మాగాంధీకి సన్నిహితుడు అబుల్ కలాం ఆజాద్ అని ఆయనతో అనేకసార్లు జైలుకు వెళ్లారన్నారు. ఆజాద్ జయంతిని జాతీయ విద్యాదినంగా జరుపుకోవడం మంచి పరిణామమన్నారు. ఎస్పీ గంగాధరరావు మాట్లాడుతూ దేశంలో అన్ని భాషలు, జాతులను ఏకతాటిపై నిలపడానికి ఆజాద్ బీజం వేశారన్నారు. మైనార్టీ నేతలు, ముస్లిం పెద్దలు ఆజాద్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో డీఈవో పీవీజీ రామారావు, జెడ్పీ సీఈవో కన్నమనాయుడు, డీఎస్పీ అబ్దుల్ సుభానీ, డీవైఈవో శేఖర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ డీకే బాలాజీ
Comments
Please login to add a commentAdd a comment