పాండురంగడికి పట్టు వస్త్రాలు
మచిలీపట్నంటౌన్: స్థానిక కీర పండరీపురం (చిలకలపూడి)లో వేంచేసిన పాండురంగస్వామి ఉత్సవాలు రెండో రోజైన మంగళవారం వైభ వంగా కొనసాగాయి. స్వామిని భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకున్నారు. ఉదయం సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహించారు. రాత్రికి రుక్మిణి, పాండురంగస్వామి కల్యాణ వేడుక కనుల పండువగా జరిగింది. పలువురు దంపతులు పీటలపై కూర్చుని ఈ వేడుకను జరి పించారు. పూజలను ఆలయ నిర్వాహకుడు టేకి నరసింహం పర్యవేక్షించారు. ఉదయం స్వామికి మంత్రి కొల్లు రవీంద్ర, నీలిమ దంపతులు పట్టువస్త్రాలను సమర్పించారు. వారికి ఆలయ నిర్వా హకుడు టేకి నరసింహం ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం కొల్లు దంపతులకు వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు. మంత్రితోపాటు స్వామిని ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. పండరీపుర క్షేత్రం తరువాత చిలకలపూడి పాండురంగస్వామి క్షేత్రానికి అత్యంత ప్రాధాన్యత ఉందన్నారు. స్వయంభువుగా వెలిసిన స్వామిని దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారన్నారు. పాండురంగస్వామి ఉత్సవాలతో పాటు కార్తిక పౌర్ణమి సముద్రస్నానాలకు విస్తృత ఏర్పాట్లు చేశామన్నారు. కార్తిక శుద్ధ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 14వ తేదీన పాండురంగస్వామి రథోత్సవం జరుగుతుందని, 15న పౌర్ణమి సందర్భంగా మంగినపూడి బీచ్‌కు లక్షలాది మంది భక్తులు సముద్ర స్నానాలకు వస్తారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment