నయనానందకరం.. నృత్యరూపకం
కూచిపూడి(మొవ్వ): ప్రముఖ నాట్య క్షేత్రం కూచిపూడిలో గురువారం పద్మభూషణ్ వెంపటి చినసత్యం శిష్యురాలు డాక్టర్ శుభ మరువాడ (అమెరికా) శిష్య బృందం ప్రదర్శించిన శ్రీకృష్ణ పారిజాతం కూచిపూడి నృత్య రూపకం నయనానందకరంగా సాగింది. వేదాంతం రాధేశ్యాం కూచిపూడి నాట్య శిల్పా రామం కూచిపూడి ఆధ్వర్యంలో శ్రీ సిద్ధేంద్రయోగి కళావేదికపై జరిగిన నృత్య రూపకాన్ని కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీతలు వేదాంతం రాధేశ్యాం, పసుమర్తి రత్తయ్య శర్మ, డాక్టర్ చింత రవి బాలకృష్ణ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెదపూడి బ్రాంచ్ మేనేజర్ సీహెచ్ పరమేష్, డాక్టర్ శుభ మరువాడలు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
కళాకారులకు, అతిథులకు సత్కారం..
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ కూచిపూడి నాట్యం నేడు ప్రపంచం నలుమూలలా విరజిల్లుతుందన్నా.. నాట్యం నమ్ముకున్న కళాకారులకు నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్తున్నాయన్నా.. పద్మభూషణ్ వెంపటి చినసత్యమే కారణమన్నారు. శ్రీ కృష్ణునిగా ప్రణూషా కారెడ్డి, సత్యభామగా అంబికా శ్రీ సిద్ధాబత్తుల, రుక్మిణిగా ప్రణవి యెర్రమ రెడ్డి, నారదునిగా సంధ్య పిరాట్ల చక్కటి హావభావాలతో అందెల సవ్వడులతో నృత్య రూపకానికి జీవం పోశారు. డాక్టర్ శుభ మరువాడ(అమెరికా) నృత్య దర్శకత్వం, నట్టువాంగంలో ఆమె శిష్యులు చేసిన నృత్య రూపకానికి గాత్రం ద్వారా సీహెచ్ సుధా శ్రీనివాస్, కౌశిక్ కల్యాణ్, మృందగంపై గణేష్ రావు, వయోలిన్‌పై సీకే విజయ రఘవన్, వేణువుపై కుమార్ బాబు సహకరించి ప్రదర్శనను మరింత రక్తి కట్టించారు. చివరిగా నిర్వాహకులు కళాకారులను, అతిథులను ఘనంగా సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment