ఆకతాయిలకు దూరంగా ఉండండి
పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు
విజయవాడస్పోర్ట్స్: ప్రేమ పేరుతో మోసాలకు పాల్పడే ఆకతాయిలను దరిచేరనివ్వద్దని విద్యార్థినులకు పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు సూచించారు. కేవలం చదువుపైనే శ్రద్ధ ఉంచి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని హితవు పలికారు. అంతర్జాతీయ మహిళలపై హింస నిర్మూలన దినోత్సవం పురస్కరించుకుని తరుణి తరంగాలు, శ్రీదుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా కాలేజీ యాజమాన్యం సంయుక్తంగా సోమవారం కాలేజీలో నిర్వహించిన అవగాహన సదస్సుకు కమిషనర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. మహిళలను ప్రేమ పేరుతో మోసం చేసే వారిని, లైంగిక వేధించే వారిని, సోషల్ మీడియాలో మహిళలను వేధించే వారిని, అఘాయిత్యాలకు పాల్పడే వ్యక్తులకు ప్రత్యేక చట్టాల ద్వారా కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో స్కూల్, కాలేజీల వద్ద ఉదయం, సాయంత్రం వేళల్లో డ్రోన్ల ద్వారా పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. విద్యార్థినులపై అమానుషంగా ప్రవర్తించే ఆకతాయిలపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆకతాయిల ఆగడాలను నియంత్రించడానికి ఈ–పహారా బీట్లను కొనసాగిస్తున్నామని కమిషనర్ వెల్లడించారు. కార్య క్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.కల్పన, జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.పద్మజ, డాక్టర్ ఆర్.సుధారాణి, తరుణి తరంగాలు ఉపాధ్యక్షురాలు విద్యాకన్నా, కన్వీనర్ సుధారాణి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment