అర్జీలను సకాలంలో పరిష్కరించండి
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజలు ఇచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశం హాల్లో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు జేసీ గీతాంజలిశర్మ, డీఆర్వో కె.చంద్రశేఖరరావు, కేఆర్‌ఆర్‌సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, ఆర్డీవో స్వాతి ప్రజల నుంచి 110 అర్జీలను స్వీకరించారు. వృద్ధుల సమస్యలను తెలుసుకునేందుకు కలెక్టర్ కిందకు దిగి వారి సమస్యలను పరిశీలించి సంబంధిత అధికారులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
● సీ్త్ర, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మాతృత్వం ఒక వరం – దత్తత దానికి మరో మార్గం అంటూ రూపొందించిన ఫ్లెక్సీ, పోస్టర్లను కలెక్టర్ డీకె బాలాజీ ఆవిష్కరించారు.
అర్జీల్లో కొన్ని
● మచిలీపట్నంలోని 30వ డివిజన్‌లో యానాది కులానికి చెందిన తుమ్మల వీరరాఘవులు 15 ఏళ్లుగా కాలువ గట్టుపై పూరిపాక వేసి నివసిస్తున్నానని తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారని వీరికి ఆధార్‌కార్డులు లేకపోవడంతో పాఠశాలల్లో ప్రవేశం కల్పించడం లేదని తెలిపారు. దీనిపై గతంలో అర్జీ కూడా ఇచ్చారు. ఎటువంటి స్పందన లేకపోవటంతో న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్‌కు మళ్లీ అర్జీ ఇచ్చారు.
● రాష్ట్రంలో ఓబీసీ కులాల గణన కూడా ప్రత్యేకంగా లెక్కించాలని తద్వారా బీసీలు అభివృద్ధి చెందితే దేశాభివృద్ధి కూడా జరుగుతుందనే భావనతో ఉన్నామని అధికారులు స్పందించి రాష్ట్రంలో కూడా కులగణన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కేవీవీ సత్యనారాయణ తదితరులు అర్జీ ఇచ్చారు.
● మచిలీపట్నంలోని సెయింట్ ప్రాన్సిస్, ఎన్జీవో కాలనీ ప్రాంతంలో పశువులు విచ్చిలవిడిగా సంచరిస్తున్నందున ఆ ప్రాంతవాసులకు ఎన్నో ఇబ్బందులు కలుగుతున్నాయి. సుమారు 60కు పైగా పశువులు రోడ్లపై అడ్డదిడ్డంగా తిరుగుతుండటంతో ప్రమాదాల బారిన పడుతున్నారు. వీటిని నియంత్రించాలని కోరుతూ యలవర్తి రామకృష్ణ తదితరులు అర్జీ ఇచ్చారు.
కలెక్టర్ డీకే బాలాజీ
Comments
Please login to add a commentAdd a comment