సాగర తీరంలో పోలీసుల మాక్‌డ్రిల్
కోడూరు: ఉగ్రవాదులు, తీవ్రవాదులు ఆచూకీ కనిపెట్టేందుకు హంసలదీవి సాగర తీరం వెంట పోలీసులు ప్రత్యేక మాక్‌డ్రిల్ నిర్వహించారు. కోస్టల్ అధికారుల ఆదేశాల మేరకు గురువారం తీరంలో సీ–విజిల్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా మచిలీపట్నం ఆర్మ్‌డ్ రిజర్వ్ డీఎస్పీ కె.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పాలకాయతిప్ప మైరెన్ సీఐ సురేష్‌రెడ్డి పర్యవేక్షణలో 50 మంది పోలీసులు కోడూరు, నాగాయలంక మండలాల్లోని తీరప్రాంత గ్రామాల్లో పటిష్టమైన బందోబస్తు నిర్వహించారు. కోస్టల్ పోలీసులు, నేవీ అధికారులు ఉగ్రవాదులు, తీవ్రవాదుల రూపంలో వచ్చి తీరప్రాంత గ్రామాల్లోని ఏదో ఒక ప్రాంతంలో దాగుంటారని, వీరిని కనిపెట్టేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మైరెన్ సీఐ సురేష్‌రెడ్డి చెప్పారు. వీరిని కనిపెట్టేందుకు పోలీసులు ప్రత్యేక పడవల ద్వారా సముద్రమార్గం వెంట సంచరించారు. సముద్రంలో వేటాడుతున్న పడవులను కూడా తనిఖీ చేశారు. పాలకాయతిప్ప, హంసలదీవి, ఉల్లిపాలెం, రామకృష్ణాపురం గ్రామాల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. వాహనాలను తనిఖీ చేయడంతో పాటు అపరిచిత వ్యక్తుల వివరాలను సేకరించారు. వేటకు వెళ్లిన మత్స్యకారుల ఐడీ కార్డులను పరిశీలించడంతో పాటు వారికి కూడా అనుమానితులను గుర్తించే ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఉగ్రవాదుల రూపంలో వచ్చిన వ్యక్తిని పోలీసులు హంసలదీవి వేణుగోపాలస్వామివారి ఆలయంలో అదుపులోకి తీసుకొని మాక్‌డ్రిల్‌ను ముగించారు. ఎస్‌ఐలు, అవనిగడ్డ సబ్ డివిజన్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment