తిరువూరు రైతు బజారులో ఆకస్మిక తనిఖీలు
తిరువూరు: జాయింట్ కలెక్టర్ నిధి మీనా బుధవారం తిరువూరు రైతుబజారును ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణంలో అధిక ధరలకు కూరగాయలు, సరుకులు విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో వినియోగదారులను జేసీ విచారించారు. స్టాల్స్ వద్ద ధరల పట్టిక సక్రమంగా నిర్వహించట్లేదని, ప్రభుత్వం సబ్సిడీపై అందించే టమాటా, నూనె విక్రయాలకు సంబంధించిన స్టాకు రిజిస్టర్లు లేవని గుర్తించారు. ఎస్టేట్ అధికారి అందుబాటులో లేకపోవడంతో జేసీ అడిగిన ప్రశ్నలకు స్టాల్స్ నిర్వాహకులు పొంతన లేని సమాధానాలు చెప్పారు. రైతు బజారులో అస్తవ్యస్త పరిస్థితులను గమనించలేకపోవడంపై పౌరసరఫరాల డీటీ శ్వేతపై జేసీ అసహనం వ్యక్తం చేశారు. రైతు బజారును స్థానిక అధికారులు తరచూ తనిఖీలు చేయకపోవడంతో వినియోగదారులకు నష్టం జరుగుతోందన్నారు. రెవెన్యూ డివిజనల్ అధికారి మాధురి, నగరపంచాయతీ కమిషనర్ లోవరాజు, జిల్లా పౌరసరఫరాల మేనేజర్ సతీష్, మార్కెటింగ్, సహకార శాఖల అధికారులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలుపై సమీక్ష..
ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరిస్తున్న విధానాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ నిధి మీనా తిరువూరులో సమీక్షించారు. స్థానిక వాహినీ ఇంజినీరింగ్ కళాశాలలో డివిజన్ స్థాయిలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో తహసీల్దార్లు, పౌరసరఫరాల అధికారులు, సహకార శాఖ అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు రైతులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా ధాన్యం కొనుగోలు చేయాలని, రైతులకు మద్దతు ధర లభించే విధంగా అధికారులు కృషి చేయాలని జేసీ సూచించారు. తిరువూరు మండలంలోని వావిలాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం అక్కడి రైతులతో మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment