ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెట్టండి
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మన ఆరోగ్యవంతమైన జీవనానికి స్వచ్ఛమైన ఉత్పత్తులు అందించడంతో పాటు పర్యావరణానికి మేలు చేసే ప్రకృతి వ్యవసాయంపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. ప్రకృతి వ్యవసాయ విధానాలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ లక్ష్మీశ.. వ్యవసాయ, ఉద్యాన, సూక్ష్మ సేద్య విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో వ్యవసాయ, అనుబంధ రంగాల కార్యకలాపాలను ఆయా శాఖల అధికారులు వివరించారు. జిల్లాలో ప్రధాన వ్యవసాయ, ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం, ఎరువులు, విత్తనాల నాణ్యత పరీక్షలు, సీసీఆర్‌సీ కార్డుల పంపిణీ, పంట రుణాలు, పంటల బీమా తదితరాలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంలో జిల్లాను మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలన్నారు. పత్తి వంటి పంటల్లో అంతర పంటలతో రైతులకు అధిక ఆదాయం లభిస్తుందన్నారు. గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల (ఆర్‌ఎస్‌కే) సిబ్బంది, గ్రామ వ్యవసాయ సహాయకులు క్షేత్రస్థాయిలో కీలకంగా వ్యవహరించాలన్నారు. ఆర్‌ఎస్‌కే – ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి, ఉద్యాన అధికారి పి.బాలాజీ కుమార్, ఏపీఎంఐపీ పీడీ పీఎం సుభాని తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment