రైతుల పాలిట కల్పవృక్షం ఆయిల్‌పామ్
పమిడిముక్కల: ఆయిల్‌పామ్ రైతుకు కల్పవృక్షంగా మారిందని జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ అన్నారు. మండలంలోని పమిడిముక్కల గ్రామంలో 3ఎఫ్ ఆయిల్‌పామ్ కంపెనీ నిర్వహిస్తున్న నర్సరీని కలెక్టర్ బాలాజీ, ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా సోమవారం సందర్శించారు. నర్సరీలో జరిగే కార్యక్రమాలను వారికి 3ఎఫ్ ఆయిల్‌పామ్ కంపెనీ జీఎం విజయప్రసాద్ వివరించారు. అనంతరం నర్సరీలో రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. ఆయిల్‌పామ్ పంటకు రాబోయే కాలంలో డిమాండ్ ఉంటుందని, గిట్టుబాటు ధర పొందొచ్చని సూచించారు. ఆయిల్‌పామ్ పంటకు కేంద్ర ప్రభుత్వం అనేక రాయితీలు ఇస్తోందని, వరి, మినుముతో పాటు ఈ పంట కూడా సాగు చేయాలని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఆయిల్‌పామ్ పంట రైతుకు లాభసాటిగా ఉంటుందన్నారు. జీఎం విజయప్రసాద్ మాట్లాడుతూ.. ఆయిల్‌పామ్ సాగును జిల్లాలోని రైతులకు పరిచయం చేసేందుకు కృష్ణా, గుంటూరు జిల్లాలకు కలిపి 3ఎఫ్ ఆయిల్‌పామ్ కంపెనీ ప్రాంతీయ కార్యాలయాన్ని వీరంకిలాకులో ఏర్పాటు చేశామన్నారు. ఆయిల్ పామ్ సాగుపై రైతులకు ఉద్యాన శాఖ, 3ఎఫ్ ఆయిల్‌పామ్ కంపెనీ సంయుక్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని పమిడిముక్కల, మొవ్వ, మోపిదేవి, అవనిగడ్డ, చల్లపల్లి మండలాలను ఆయిల్ పామ్ సాగుకు అనుకూలమైనవిగా గుర్తించామని, నూనె గింజల ఉత్పత్తిలో మన దేశం స్వయం సమృద్ధి సాధించేందుకు ఆయిల్‌పామ్ సాగు చేపట్టాల్సిందిగా రైతులను ప్రోత్సహిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి జె.జ్యోతి, సర్పంచ్ ముళ్లపూడి సునీత, కృష్ణాపురం డీసీ చైర్మన్ నాదెళ్ల సుబ్రహ్మణ్యం, ఏజీఎం చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment