వ్యవసాయ సేవలకు ప్రతి రైతుకు గుర్తింపు కార్డు
గుడ్లవల్లేరు: వ్యవసాయ సేవలను ప్రభుత్వం అందించేందుకు ఏపీ రిజిస్ట్రీ పోర్టల్‌లో కృష్ణాజిల్లాలోని ప్రతి ఒక్క రైతుకూ ప్రత్యేక గుర్తింపు కార్డును అందిస్తున్నామని ఆదివారం జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఎన్.పద్మావతి తెలిపారు. జిల్లాలో 1.50 లక్షల మంది రైతులు సొంత భూములు కలిగి ఉన్నారని చెప్పారు. భూమి గల ప్రతి రైతుకు ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యను ఇవ్వడం ద్వారా వ్యవసాయ సేవలను సులభతరంగా అందించవచ్చునన్నారు. రైతులకు తమ వ్యవసాయ శాఖ సేవలను పారదర్శకంగా మరింత అందుబాటులోకి తీసుకురావడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్యోద్దేశమని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సమన్వయంతో ఏపీ వ్యవసాయ శాఖ ఈ కార్యక్రమం చేపడుతున్నదని చెప్పారు. ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు ఇతర వ్యవసాయ సంబంధిత సేవలు పొందటానికి రైతు రిజిస్ట్రీ పోర్టల్‌లో నమోదు చేసిన తర్వాత భూమి గల ప్రతి రైతుకు కేటాయించే ప్రత్యేక సంఖ్య(11అంకెల సంఖ్య) అధికార గుర్తింపుగా పని చేస్తుందన్నారు.
ప్రతి రైతు వెంటనే తమ వివరాలను రైతు రిజిస్ట్రీ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని జేడీఏ పద్మావతి సూచించారు. నమోదు చేసుకునే వారి కుటుంబంలోని భూమి హక్కుదారులతో పాటు వారి గ్రామంలోని ఇతర రైతులు కూడా నమోదు చేసుకునే విధంగా తమ వ్యవసాయ శాఖకు సహకరించాలని జిల్లా రైతులను జేడీఏ కోరారు.
కృష్ణాజిల్లా వ్యవసాయ శాఖాధికారి
ఎన్.పద్మావతి
Comments
Please login to add a commentAdd a comment