![జాతీయ](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/09pdn41-310171_mr-1739129038-0.jpg.webp?itok=_hU6FgB5)
జాతీయ రహదారిపై కారు బీభత్సం
గూడూరు: విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారిపై గూడూరు మండలం రామరాజుపాలెం అడ్డరోడ్డు వద్ద ఆదివారం ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం పాలవగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ప్రమాదానికి సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ప్రమాదానికి కారణమైన కారు విజయవాడ నుంచి మచిలీపట్నం వైపు అతి వేగంగా వస్తోంది. అదే సమయంలో విన్నకోట సాంబశివరావు(55) అనే వ్యక్తి గూడూరు నుంచి మల్లవోలు గ్రామానికి ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. రామరాజుపాలెం అడ్డరోడ్డు దగ్గర సాంబశివరావు ద్విచక్ర వాహనాన్ని కారు వెనుక నుంచి బలంగా ఢీకొని వెళ్లింది. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయమవడంతో సాంబశివరావు ఘటనాస్థలంలోనే ప్రాణాలు విడిచాడు. సాంబశివరావును ఢీకొన్న కారు అదే వేగంతో మచిలీపట్నం వైపు వెళ్తున్న ఆటోను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఆటో భారీ కుదుపులకు గురై అదుపుతప్పి మార్జిన్‌లోకి వెళ్లిపోయింది. అందులో ప్రయాణిస్తున్న డ్రైవర్ పేరం రాంబాబుతో పాటు కామేశ్వరమ్మ అనే ప్రయాణికురాలికి కూడా బలమైన గాయాలయ్యాయి. కారు ఢీకొన్న సాంబశివరావు ద్విచక్ర వాహనం అంతెత్తున ఎగిరి ముందుగా వెళ్తున్న మరో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ఆ వాహనంపై వెళ్తున్న ఈడే రాంబాబుకు కూడా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పెడన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కె.నాగేంద్రకుమార్, గూడూరు ఎస్‌ఐ కె.ఎన్.వి.సత్యనారాయణ, సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. క్షతగాత్రులను బందరు సర్వజనాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మల్లవోలులో విషాద ఛాయలు
రోడ్డు ప్రమాదంలో విన్నకోట సాంబశివరావు దుర్మరణం చెందటంతో మల్లవోలులో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్నకారు రైతు అయిన సాంబశివరావుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కూతురిని గూడూరుకు చెందిన పుప్పాల వెంకటేశ్వరరావుకు ఇచ్చి వివాహం చేశాడు. అల్లుడు ఇల్లు కట్టుకుంటుండడంతో చూడటానికి వచ్చిన సాంబశివరావు తిరిగి వెళ్తున్న క్రమంలో ప్రమాదానికి గురై దుర్మరణం చెందటాన్ని కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఒకరు దుర్మరణం
– మరో ముగ్గురికి గాయాలు
ద్విచక్రవాహనం, ఆటోను
ఢీకొడుతూ వెళ్లిన కారు
![జాతీయ రహదారిపై కారు బీభత్సం 1](https://www.sakshi.com/gallery_images/2025/02/10/09pdn44-310171_mr-1739129038-1.jpg)
జాతీయ రహదారిపై కారు బీభత్సం
![జాతీయ రహదారిపై కారు బీభత్సం 2](https://www.sakshi.com/gallery_images/2025/02/10/09pdn45-310171_mr-1739129038-2.jpg)
జాతీయ రహదారిపై కారు బీభత్సం
Comments
Please login to add a commentAdd a comment