![పటిష్ట ప్రణాళికతో ఎన్నికల నిర్వహణ](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10mcpm03-310108_mr-1739217104-0.jpg.webp?itok=XBimYroJ)
పటిష్ట ప్రణాళికతో ఎన్నికల నిర్వహణ
చిలకలపూడి(మచిలీపట్నం): ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా అధికారుల సమన్వయంతో శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికను పటిష్ట ప్రణాళికతో నిర్వహించేందుకు సిద్ధం కావాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ఎస్పీ ఆర్. గంగాధరరావుతో కలిసి నోడల్ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నియమ నిబంధనలు పాటిస్తూ పక్కా ప్రణాళికతో లోటుపాట్లకు తావులేకుండా ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయాలన్నారు. సాధారణ ఎన్నికలకు వర్తించే నిబంధనలు ఈ ఎన్నికలకు కూడా వర్తిస్తాయన్నారు. పూర్తిగా బ్యాలెట్ విధానంలో నిర్వహించేందుకు పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సిద్ధంగా ఉండాలన్నారు. ఈ పోలింగ్ జిల్లాలో 77 కేంద్రాలను ఏర్పాటు చేశామని 63,114 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉందన్నారు. ఈ నెల 27వ తేదీ నిర్వహించే పోలింగ్‌కు అన్ని ఏర్పాటు చేసి సిద్ధంగా ఉండాలన్నారు. జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలో డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, టెంపరరీ స్ట్రాంగ్‌రూమ్‌లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. మచిలీపట్నం డివిజన్‌కు నోబుల్ కళాశాల, గుడివాడ, ఉయ్యూరు డివిజన్లకు ఆయా ఆర్డీవో కార్యాలయాల్లో ఏర్పాటు చేసుకోవాలన్నారు. 77 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 250 బ్యాలెట్ బాక్సులను ఇప్పటికే సిద్ధంగా ఉంచామన్నారు. 77 మంది ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, 154 మంది ఇతర పోలింగ్ ఆఫీసర్లు, రిజర్వులో 77 మందితో కలిపి 462 మందిని సిబ్బందిని నియమించామన్నారు. వీరికి ఈ నెల 12న శిక్షణ ఇస్తామన్నారు.
ఎన్నికల అధికారులకు శిక్షణ..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ తదితర అధికారులకు సోమవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం నియమితులైన బృందాలు కోడ్ ఉల్లంఘించిన వారిపై తీసుకున్న చర్యలపై రోజువారీ నివేదికలను పంపాలన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలన్నారు. జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా నిరంతరాయంగా నిఘా పెట్టాలన్నారు. ఎస్పీ ఆర్. గంగాధరరావు మాట్లాడుతూ బృందాల సభ్యులు సమన్వయంతో విధులు నిర్వర్తించాలన్నారు.
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ
పటిష్ట బందోబస్తు..
ఎస్పీ ఆర్. గంగాధరరావు మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన నిర్వహించే పోలింగ్‌కు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నోటిఫికేషన్ జారీ అయిన తేదీ నుంచి ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలు చేస్తున్నామన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ, డీఆర్వో కె చంద్రశేఖరరావు, ఆర్డీవోలు కె. స్వాతి, జి. బాలసుబ్రహ్మణ్యం, బీఎస్ హేళాషారోన్, అడిషనల్ ఎస్పీ వీవీ నాయకుడు, నోడల్ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment