శ్రీమఠంలో భక్తుల సందడి
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. కార్తీక మాసం కావడంతో భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామి సేవలో తరిస్తున్నారు. సోమవారం భక్తులు అధిక సంఖ్యలో మంత్రాలయానికి చేరుకున్నారు. పవిత్ర తుంగభద్ర నదిలో పుణ్యస్నానాలు ఆచరించి గ్రామ దేవత మంచాలమ్మ, రాఘవేంద్రుల మూల బృందావన దర్శనం చేసుకున్నారు. స్వామి దర్శనానికి గంటన్నర సమయం పట్టింది. భక్తుల సందడితో శ్రీమఠం కారిడార్ ప్రాంగణం, అన్నపూర్ణ భోజనశాల, పరిమళ ప్రసాదం కౌంటర్లు కిక్కిరిశాయి.
పది పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పెంపు
కర్నూలు సిటీ: పదవ తరగతి పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులు ఫీజు చెల్లించే గడువును పెంచినట్లు డీఈఓ శామ్యూల్ పాల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 18వ తేదీలోపు ఫీజు చెల్లించేందుకు గడువు ఉండగా ఈ నెల 26వ తేదీ వరకు పెంచారు. రూ.50 అపరాధ రుసుంతో 19 నుంచి 25వ తేదీలోపు, రూ.200 అపరాధ రుసుంతో 26 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు, రూ.500 అపరాధ రుసుంతో వచ్చే నెల 4 నుంచి 10వ తేదీ వరకు గడువు ఉందని డీఈఓ వెల్లడించారు. రెగ్యులర్ అభ్యర్థులకు అన్ని సబ్జెక్టులకు రూ.125, 3 సబ్జెక్టులకుపైగా ఉంటే రూ.125, 3 సబ్జెక్టుల లోపు ఉంటే రూ.110, ఒకేషనల్ అభ్యర్థులకు అదనంగా రూ.60, తక్కువ వయస్సు కలిగిన అభ్యర్థులకు రూ.300, మైగ్రేషన్ సర్టిఫికెట్ కోసం అవసరం అయితే రూ.80 ప్రకారం ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఫీజు చెల్లింపు తదితర పూర్తి సమాచారం కోసం www.bse.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని డీఈఓ పేర్కొన్నారు.
డ్రోన్ టెక్నాలజీపై
అవగాహన పెంచుకోవాలి
కర్నూలు (టౌన్): డ్రోన్ టెక్నాలజీపై పోలీసులు అవగాహన పెంచుకొవాలని జిల్లా ఎస్పీ బిందుమాధవ్ స్పష్టం చేశారు. సోమవారం స్థానిక కర్నూలు నగర శివారులోని దిన్నె దేవరపాడు వద్ద ఉన్న పోలీసు శిక్షణ కేంద్రంలో డ్రోన్ టెక్నాలజీపై, సైబర్ నేరాల టెక్నాలజీపై 2 రోజుల పాటు 21 మంది పోలీసులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డ్రోన్ కెమారాలు ఉపయోగించే పనితీరు సామర్థ్యాన్ని ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో జిల్లా వ్యాప్తంగా 400 మందిని డ్రోన్ ఆపరేటర్స్‌గా తీర్చిదిద్దే విధంగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. జన సమూహం, ఊరేగింపులు, పండుగలు, గస్తీ, ఉత్సవాలలో డ్రోన్ కెమెరా టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చామన్నారు. శాంతి భద్రతలు కాపాడటంలో డ్రోన్ కెమెరాల వినియోగాన్ని కీలకం చేస్తామన్నారు. కార్యక్రమంలో సీఐలు ప్రసాద్, అబ్దుల్ గౌస్, డీటీసీ సీఐ గౌతమి, సైబర్ ల్యాబ్ సీఐ వేణుగోపాల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment