170 మందికి నాలుగు గదులు
● వసతి గృహాల్లో సౌకర్యాలు మృగ్యం
● ఇరుకు గదుల్లో కునారిల్లుతున్న
విద్యార్థులు
● ఎప్పుడు కూలుతాయో తెలియని
శిథిలావస్థ భవనాలు
● పరిసరాల్లో పేరుకుపోయిన
చెత్తా చెదారం
● ప్రహరీలు లేక పందులు,
కుక్కల స్వైర విహారం
● గురుకులాల్లో కూడా పనిచేయని
సీసీ కెమెరాలు
● విద్యార్థులకు రక్షణ కరువు
ఒకే గదిలో తమ ట్రంకు పెట్టులు, పుస్తకాలతో పాటు ఇరుకుగా నిద్రస్తున్న విద్యార్థులు ఆస్పరి మండలం చిన్నహోతూరు బీసీ వసతి గృహంలోనిది ఈ చిత్రం. ఈ హాస్టల్‌లో 170 మంది విద్యార్థులు ఉన్నారు. నాలుగు గదులు మాత్రమే ఉన్నాయి. వీటిల్లోనే విద్యార్థులు నిద్రించాల్సిన పరిస్థితి. ఫ్యాన్లు లేక, గదులకు కిటికీలు లేక దోమలతో ఇబ్బంది పడుతూ.. చలికి వణుకుతూ కాలం వెళ్లదీస్తున్నారు.
కర్నూలు(అర్బన్): జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో అనేక సమస్యలు తాండవిస్తున్నాయి. మెజార్టీ వసతి గృహాల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాలు లేకపోవడం వల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వసతి గృహాలు జిల్లాలో మొత్తం 92 ఉండగా, 19,372 మంది విద్యార్థినీ, విద్యార్థులు వసతి పొందుతున్నారు. అనేక హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా గదులు లేకపోవడం వల్ల ఇరుకు గదుల్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. అలాగే టాయిలెట్లు, బాత్‌రూముల సమస్య కూడా వారిని వేధిస్తోంది. ముఖ్యంగా దశాబ్దాల క్రితం నిర్మించిన భవనాలే అధికంగా ఉండడంతో ఆయా భవనాలు ప్రస్తుతం పూర్తి శిఽథిలావస్థకు చేరాయి. పలు వసతి గృహాల్లో పైకప్పుల పెచ్చులు ఊడిపోయి చాలా ప్రమాదకరంగా మారాయి. మరికొన్ని వసతి గృహాల్లోని కిటికీలకు రెక్కలు కూడా లేకపోవడంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో ఆయా వసతి గృహాల్లోని విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలతో పాటు డా.బీఆర్ అంబేడ్కర్, మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకులాల్లోని విద్యార్థులు కూడా పలు సమస్యలతో సతమతమవుతున్నారు.
బాలికల హాస్టళ్లకు రక్షణ అంతంతే...
ప్రభుత్వ బాలికల వసతి గృహాల్లో రక్షణ అంతంతమాత్రంగానే ఉంది. ఒకటి రెండు చోట్ల మినహా మెజార్టీ వసతి గృహాలకు ప్రహరీలు ఉన్నా ఫెన్సింగ్ లేకపోవడం వల్ల ఎప్పుడు ఏమి జరుగుతోందనని విద్యార్థినులు, సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కళాశాల బాలికల వసతి గృహాల్లో మాత్రం సంబంధిత వసతి గృహ సంక్షేమాధికారులు సొంత డబ్బులు వెచ్చించి పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు. బాలికల వసతి గృహాలకు సంబంధించి కూడా సరైన వసతులు లేకపోవడం వల్ల విద్యార్థినులు ఇబ్బందులకు గురవుతున్నారు.
పశ్చిమ ప్రాంతానికి హాస్టళ్లే దిక్కు ...
కరువుకు ఆలవాలమైన జిల్లాలోని పడమటి ప్రాంతానికి చెందిన విద్యార్థులకు ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలే దిక్కు. ఇక్కడి చాలా గ్రామాల్లోని ప్రజలు ప్రతి ఏడాది సుదూర ప్రాంతాలకు వలస వెళ్తుండడం వల్ల వారి పిల్లలను హాస్టళ్లలోనే వదలి వెళ్తుంటారు. ఈ నేపథ్యంలోనే పడమటి ప్రాంతాల్లోని (ఆదోని, ఆలూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాలకు చెందిన వారు) వసతి గృహాల్లో విద్యార్థుల సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. అయితే ఈ ప్రాంతాల్లోని వసతి గృహాలు పూర్తి అధ్వానంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment