కర్నూలులో హైకోర్టు ఆశలు ఆవిరి
● ‘బెంచ్’ ఏర్పాటుకు అసెంబ్లీలో కూటమి సర్కారు తీర్మానం
● 45 మంది సీమ ప్రజాప్రతినిధులున్నా నోరు విప్పని వైనం
● బెంచ్ వద్దంటున్న న్యాయవాదులు, సీమ వాసులు
● హక్కుగా రావాల్సిన హైకోర్టునే కర్నూలులో నెలకొల్పాలని డిమాండ్
● ఏడు దశాబ్దాల అన్యాయాన్ని సరిదిద్దుతూ నాడు జగన్ సర్కారు అడుగులు
● కర్నూలులో 273 ఎకరాల్లో జ్యుడీషియల్ సిటీకి భూమి కేటాయింపు
● వంద ఎకరాల్లో నేషనల్
లా యూనివర్సిటీకి
శంకుస్థాపన
● హైకోర్టు, అనుబంధ
సంస్థలను నెలకొల్పి
‘న్యాయ రాజధాని’
దిశగా చర్యలు
ఊహించిందే జరుగుతోంది! రాయలసీమ మరోసారి మోసపోతోంది!! ఏడు దశాబ్దాలుగా ‘సీమ’కు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతూ హక్కుగా రావాల్సిన హైకోర్టు ఏర్పాటు దిశగా గత సర్కారు అడుగులు వేస్తే.. కూటమి సర్కారు తాజాగా ‘బెంచ్’ మాత్రమే ఏర్పాటు చేయనున్నట్లు అసెంబ్లీలో తీర్మానం చేసింది. దీంతో హైకోర్టు రాకతో కర్నూలు న్యాయ రాజధాని అవుతుందనుకున్న ‘సీమ’ వాసుల ఆశలు అడియాశలయ్యాయి. సీమ ప్రాంతానికి చెందిన 45 మంది ప్రజాప్రతినిధులు, సీఎం, ఏడుగురు మంత్రులున్న అసెంబ్లీ సాక్షిగా మరోసారి ద్రోహం తలపెట్టారు. – సాక్షి ప్రతినిధి కర్నూలు
కర్నూలులో హైకోర్టు బెంచ్ నెలకొల్పేందుకు ఆమోదం తెలియచేస్తూ శాసనసభ గురువారం తీర్మానం చేసింది. హైకోర్టు బెంచ్ ఏర్పాటు తీర్మానాన్ని నంద్యాల వాసి, మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ స్వయంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కూటమి పార్టీలైన టీడీపీ, బీజేపీ, జనసేన ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించాయి. హైకోర్టు బెంచ్ ఏర్పాటుతో ‘సీమ’కు మేలు జరుగుతుందని కూటమి నేతలు నమ్మబలుకుతుండటంపై ‘సీమ’ వాసులు, న్యాయవాదులు మండిపడుతున్నారు. ముక్తకంఠంతో తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నారు. బెంచ్ ఏర్పాటుకు కూటమి సర్కారు ఆమోదం తెలపడమంటే సీమలో హైకోర్టు ఆశలకు శాశ్వతంగా దూరమైనట్లేనని హెచ్చరిస్తున్నారు.
పెద్ద మనుషుల ఒప్పందం గాలికి..
కర్నూలులో హైకోర్టు ఏర్పాటు అనేది రాయలసీమ హక్కు అని నిపుణులు, న్యాయ కోవిదులు పేర్కొంటున్నారు. తమిళనాడు నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు కర్నూలు రాష్ట్ర రాజధానిగా ఏర్పాటైంది. ఆపై హైదరాబాద్ విలీనం కావడంతో కర్నూలు రాజధానిని ‘సీమ’ వాసులు త్యాగం చేశారు. దీంతో హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలని మద్రాసులోని కాశీనాథుని నాగేశ్వరరావు ఇంట్లో పెద్దమనుషులు ఒప్పందం చేసుకున్నారు. అయితే అనంతరం ఏ ప్రభుత్వం కూడా హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేసే దిశగా చర్యలకు ఉపక్రమించలేదు. హైదరాబాద్‌లోనే హైకోర్టును నెలకొల్పారు. అనంతరం 2014లో రాష్ట్ర విభజన సమయంలో రాజధానిని కర్నూలులో ఏర్పాటు చేయాలని లేదంటే హైకోర్టును ఏర్పాటు చేయాలని సీమ వాసులు డిమాండ్ చేశారు. అయితే నాడు చంద్రబాబు సర్కారు ఎవరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా అమరావతిని రాజధానిగా ప్రకటించి అక్కడే హైకోర్టు ఏర్పాటుకు ఏకపక్ష నిర్ణయం తీసుకుంది.
ఏడు దశాబ్దాల అన్యాయాన్ని సరిదిద్దుతూ..
2019లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పాటయ్యాక కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని భావించారు. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారు. జగన్నాథగట్టుపై 273 ఎకరాల భూమిని కూడా కేటాయించారు. అందులో హైకోర్టు, నేషనల్ లా యూనివర్సిటీ 43 ట్రిబ్యునల్స్‌తో జ్యుడిషియల్ సిటీ నెలకొల్పాలని సంకల్పించారు. అనివార్య కారణాలతో జాప్యం జరగడంతో లోకాయుక్త, హెచ్‌ఆర్సీ, ఏపీఈఆర్‌సీ, వక్ఫ్‌ట్రిబ్యునల్, సీబీఐ కోర్టులను ఏర్పాటు చేశారు. పూర్తిస్థాయిలో జ్యుడీషియల్ సిటీ ఏర్పాటైతే కర్నూలు అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని భావించారు. లా యూనివర్సిటీకి రూ.వెయ్యి కోట్లతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భూమి పూజ కూడా చేశారు. అయితే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైన ఐదు నెలలకే ‘సీమ’కు తీవ్ర నష్టం వాటిల్లేలా మరో చర్యకు ఉపక్రమించి కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అసెంబ్లీలో తీర్మానం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment