కదం తొక్కిన వలంటీర్లు
● కూటమి ప్రభుత్వం నమ్మించి
మోసం చేయడంపై ఆగ్రహం
● రాజ్‌విహార్ సర్కిల్ నుంచి కలెక్టరేట్
వరకు భారీ ర్యాలీ, నిరసన
● హామీ మేరకు వేతనం పెంపుతో పాటు
ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్
కర్నూలు(సెంట్రల్): వలంటీర్లను కొనసాగించడంతో పాటు వేతనం పెంచుతామని ఎన్నికల ముందు చంద్రబాబు ప్రకటించారు. అధికారంలోకి వచ్చి ఆరునెలలవుతున్నా వేతనం పెంచకపోగా వలంటీర్ వ్యవస్థనే లేదని చెప్పడంతో వలంటీర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం వేతనం పెంపుతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం రోడ్డెక్కారు. రాజ్‌విహార్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వలంటీర్ అసోసియేషన్ నాయకులు కుమార్, మక్బూల్‌బాషా, రాము, నరసన్న మాట్లాడుతూ సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఆరునెలలుగా తమను తీసివేసేందుకు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. వలంటీర్ వ్యవస్థే లేదనప్పుడు విజయవాడలో వరద సహాయక చర్యల్లో తమతో ఎలా పని చేయించుకున్నారని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో రూ.5 వేల గౌరవ వేతనం చాలదని, రూ.10 వేలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక పట్టించుకోకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా 2.60 లక్షల మంది రోడ్డున పడ్డారని చెప్పారు. ఇటీవల శాసన మండలిలో వలంటీర్ వ్యవస్థ లేదని సాంఘిక సంక్షేమ శాఖామంత్రి బాలావీరాంజనేయులు ప్రకటించడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. వలంటీర్లు వ్యవస్థలో లేకపోతే ఎన్నికల ముందు ఎందుకు తమను కొనసాగిస్తామని, వేతనాలు పెంచుతామని చెప్పారని ప్రశ్నించారు. ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబునాయుడు వలంటీర్లను కొనసాగించాలన్నారు. లేకపోతే ఆందోళన కార్యక్రమాలు మరింత తీవ్రతరం చేస్తామన్నారు. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యవస్థలో వలంటీర్లు లేరని చెప్పడాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిరసన తెలిపే హక్కును కాలరాస్తున్నారని పదే పదే చెప్పిన మంత్రులు పవన్ కల్యాణ్, లోకేష్, అనితలు ఇప్పుడు తమను ఎందుకు అణచివేస్తున్నారని ప్రశ్నించారు. ఈనెల 9వ తేదీన విజయవాడలో జరిగిన సదస్సుకు వెళ్లకుండా వలంటీర్లను పోలీసులు అడ్డుకున్నారని, 41ఏ నోటీసులు ఇచ్చారని, వీటికి మంత్రులు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. కార్యక్రమంలో వలంటీర్లు గోవిందమ్మ, రేష్మ, గౌసియా, వీరాంజనేయులు, ప్రభాకర్,రవి, రాజశేఖర్. నాగరాజు పాల్గొన్నారు.
ఆందోళనకు వచ్చిన వలంటీర్ల
వివరాల సేకరణ
మరోవైపు తమ ఉద్యోగాలు పోయి తీవ్ర దుర్భర పరిస్థితుల్లో ఉన్న వలంటీర్లకు పోలీసులు షాక్ ఇస్తున్నారు. ఆందోళనలు చేసేందుకు వచ్చిన వారి వివరాలు సేకరిస్తున్నారు. వచ్చిన వారి ఇంటి అడ్రస్, సెల్ నంబర్‌తోపాటు అన్ని వివరాలను సేకరిస్తుండడంతో వలంటీర్లు అందోళన చెందుతున్నారు. కాగా, వలంటీర్లకు మద్దతు తెలిపిన ఏఐవైఎఫ్ నాయకులను కూడా పోలీసులు బెదిరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment