గడువులోపు అర్జీలను పరిష్కరించాలి
కర్నూలు(సెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే సమస్యలకు జాప్యం లేకుండా నిర్దేశించిన గడువులోపు పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ నవ్య అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జేసీతోపాటు డీఆర్వో సి.వెంకట నారాయణమ్మ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని, రీ ఓపెన్ కాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ వారంలో 93 అర్జీలను ఇప్పటి వరకు ఓపెన్ చేసి చూడలేదన్నారు. ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 55, పోలీసు శాఖకు సంబంధించి 30 ఉన్నాయన్నారు. వెంటనే వాటిని పరిశీలించాలని ఆదేశించారు. రీ ఓపెన్ కేసుల్లో 15 పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కొండయ్య, చిరంజీవి పాల్గొన్నారు.
వచ్చిన అర్జీల్లో కొన్ని....
● పొలాలకు ఉన్న బండ్ల రస్తాను అడ్డుకుంటున్నారని సీబెళగల్ మండలం కె.సింగవరానికి చెందిన రైతులు చిన్న తిమ్మన్న, నాగరాజు, ఎర్రన్న, చెన్నయ్య అధికారులకు విన్నవించారు. తమ పొలాలకు వెంటనే రస్తాను చూపించాలని వారు కోరారు.
● కోడుమూరులోని గీతాలక్ష్మీ నగర్‌లో ఉన్న కొన్ని కుటుంబాలకు మాత్రమే కుళాయిల ద్వారా నీరు సరఫరా అవుతోందని, దాదాపు 200 కుటుంబాలకు నీరు అందడం లేదని కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు.
● కల్లూరు ప్రాంతంలోని హంద్రీ నది పరివాహక బఫర్ జోన్ పరిధిని దాటిని విఠల్ నగర్‌కు చెందిన కొందరు ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారని కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు.
● 2021లో కావేరి జాదు నకిలీ విత్తనాలతో పంటలు నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం అందజేయాలని కోరుతూ ఏపీ రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ వినతిపత్రం సమర్పించారు.
● కల్లూరు చెన్నమ్మ సర్కిల్ నుంచి ముజఫర్ నగర్‌కు ఉన్న రోడ్డు శిథిలావస్థకు చేరుకుందని, వెంటనే కొత్త రోడ్డు నిర్మించాలని డీవైఎఫ్‌ఐ నాయకులు పద్మ, హుస్సేన్ వినతిపత్రం ఇచ్చారు.
● కర్నూలు నగరంతోని బఫర్‌జోన్‌పేరుతో హంద్రీ నది పరివాహక ప్రాంతంలోనివసించే పేదల నివాసాలను కూల్చివేయాలని నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని సీపీఎం నాయకులు టి.రాముడు, సి.గురుశేఖర్, ఉసేన్‌బాషా విన్నవించారు.
● కర్నూలు నగరంలోని పలుసర్వే నంబర్లలోని ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సీపీఐ నాయకులు కె.జగన్నాథం ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించార.
● కర్నూలులోని హంద్రీ వెంట తిరుమల గిరి వెంచర్‌పేరుతో అగ్రసేని సంస్థ వేసిన ప్లాట్లు, ఇళ్లకు కనీసం ల్యాండ్ కన్వర్షన్, వెంచర్‌కు అప్రూవల్ లేకున్నా అనుమతులు ఇచ్చిన కర్నూలు నగర పాలక సంస్థ టౌన్‌ప్లానింగ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాయలసీమ యువజన పోరాట సమితి నాయకులు వీవీ నాయుడు, ఎ.రామిరెడ్డి వినతిపత్రం ఇచ్చారు.
జేసీ డాక్టర్ నవ్య
Comments
Please login to add a commentAdd a comment