ఆర్‌యూ ఇంజినీరింగ్ పరీక్షలు ప్రారంభం
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయ ఇంజినీరింగ్ కళాశాల బీటెక్ విద్యార్థులకు 3, 7 సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. పరీక్ష కేంద్రాలను వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎన్‌టీకే నాయక్ సందర్శించి పరిశీలించారు. అనంతరం వర్సిటీ సైన్స్, ఆర్ట్స్ కళాశాలలను సందర్శించారు. తరగతులు జరుగుతున్న తీరును పరిశీలించారు. మూడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలకు సంబంధించి 224 మందికి 223 హాజరు కాగా ఒకరు గైర్హాజరయ్యారని ఆర్‌యూసీఈ ప్రిన్సిపాల్ డాక్టర్ హరిప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. సప్లిమెంటరీ పరీక్షలకు 74 మంది, ఏడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలకు సంబంధించి 167 మంది హాజరైనట్లు తెలిపారు. వీసీతో పాటు వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ విజయకుమార్ నాయుడు ఉన్నారు.
రేపు సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్ ప్రవేశ పరీక్ష
కర్నూలు (అర్బన్): ఈనెల 27వ తేదీన స్థానిక బీసీ స్టడీ సర్కిల్‌లో ఉదయం 11 గంటలకు సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్‌కు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ, సాధికారత అధికారిణి పి.వెంకటలక్షుమ్మ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఉదయం 9 గంటల లోపు ఏపీ బీసీ స్టడీ సర్కిల్ పరీక్ష హాలుకు హాజరుకావాలన్నారు. 10.45 గంటల తర్వాత హాజరైన విద్యార్థులను పరీక్ష హాల్‌లోకి అనుమతించడం జరగదన్నారు. పరీక్ష కేంద్రాలకు వచ్చే సమయంలో విద్యార్థులు సెల్‌ఫోన్, స్మార్ట్ వాచ్, క్యాలిక్యులేటర్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకూడదన్నారు.
విభిన్న ప్రతిభావంతులకు 28న ఆటల పోటీలు
కర్నూలు(అర్బన్): అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల (దివ్యాంగుల) దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 28వ తేదీన స్థానిక అవుట్‌డోర్ స్టేడియంలో ఉమ్మడి జిల్లా స్థాయి ఆటల పోటీలను నిర్వహిస్తున్నట్లు విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రయిస్‌ఫాతిమా సోమ వారం పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన విభిన్న ప్రతిభావంతులు, బధిరులు, మానసిక దివ్యాంగులు, అంధులు ఆటల పోటీల్లో పాల్గొని క్రీడా ప్రతిభ చాటాలన్నారు. వివరాలకు 08518–277864 సంప్రదించాలన్నారు.
రీ సర్వే అర్జీలను
త్వరగా పరిష్కరించాలి
కర్నూలు(సెంట్రల్): గ్రామసభలో వచ్చిన రీసర్వే అర్జీలను డిసెంబర్ 31లోపు నాణ్యతతో పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి వివిధ అంశాలపై మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జేసీ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఇటీవల గ్రామసభల్లో వచ్చిన సర్వే అర్జీలపై సీఎంఓ కార్యాలయం మానిటరింగ్ చేస్తుండడంతో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. రీసర్వేలో ఎక్కువగా పరిధి విస్తరణ, జాయింట్ ఎల్‌పీఎం సమస్యలు ఉన్నాయన్నారు. విద్యాశాఖకు సంబంధించి డిసెంబర్ 7వ తేదీన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించాలన్నారు.కార్యక్రమంలో ఆదోని సబ్‌కలెక్టర్ మౌర్య భరద్వాజ్, పత్తికొండ, కర్నూలు ఆర్‌డీఓలు భరత్‌కుమార్, సందీప్‌కుమార్, సర్వే ఏడీ మునికన్నన్, డీఈఓ శామ్యూల్ పాల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment