మహబూబాబాద్: తండ్రి మృతి చెందిన అనంతరం ఓ ప్రబుద్ధుడు.. తల్లిని బెదిరించి ఆమె పేరుతో ఉన్న భూమి, ప్లాటు తన పేరున రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అనంతరం భార్యతో కలిసి ఇంటికి తాళం వేసుకుని తల్లిని బయటకు గెంటివేశాడు. దీంతో ఆ తల్లి దిక్కుతోచని స్థితిలో పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయినా ఆ తనయుడి తీరులో మార్పులేదు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
మండలంలోని నేలపోగులకు చెందిన కేమిడి పద్మ, అంజయ్య దంపతులకు కొడుకు నరేశ్, కూతురు అనూష ఉన్నారు. తండ్రి అంజయ్య పదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. అయినా కష్టాలు, బాధలు దిగమింగుతూ తల్లియే వీరిద్దరి వివాహం చేసింది. అంజయ్య మృతి చెందడంతో భూమి, ప్లాటు పద్మ పేరుతో ఉన్నాయి. కూతురు అనూషకు అప్పట్లో కట్నం ఇవ్వలేదు. ఇప్పుడు ఇవ్వమంటే కుమారుడు నరేశ్ నిరాకరిస్తూ తల్లిని బెదిరించి ఆమె బంగారం బ్యాంక్‌లో కుదువ పెట్టుకుని, భూమి, ప్లాటు బలవంతంగా రిజిస్ట్రేషన్ చేసుకుని బెదిరిస్తున్నాడు.
కొద్ది రోజులుగా తల్లి, కూతురుకు ఆరోగ్యం బాగులేకపోవడంతో నేలపోగులలోనే ఉంటున్నారు. శనివారం రాత్రి నరేశ్ తన భార్య భవానితో కలిసి తల్లి పద్మ, చెల్లి అనూషను గెంటేసి తాళం వేసి అత్తగారింటికి వెళ్లిపోయాడు. దీంతో పద్మ.. ఎస్సై ప్రవీణ్‌ను ఆశ్రయించింది. ఎస్సై వెంటనే సిబ్బందిని పంపించి తాళం తీయించి ఇంట్లోకి పంపించారు. ఆదివారం ఉదయం మళ్లీ వచ్చిన నరేశ్ తన భార్యతో వచ్చి పోలీసులకు చెబుతారా అంటూ తల్లిని, చెల్లిని తిడుతూ చంపుతానని బెదిరించడంతో ఆదివారం కొడుకు, కోడలిపై పద్మ.. పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment