జాతరకు సిద్ధం
● 15న కందగిరి లక్ష్మీనర్సింహస్వామి జాతర
● కందికొండపై కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహణ
● తరలిరానున్న భక్తులు.. ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
చారిత్రక అంశాలు..
కందికొండ గుట్ట ఆధ్యాత్మికతకు నిలయంగానే కాకుండా ఎన్నో చారిత్రక అంశాలకు నెలవుగా ఉంది. గుట్టపైకి వెళ్తుంటే అనేక చోట నీటి కోనేర్లు దర్శనమిస్తాయి. అన్ని కాలాల్లో ఆ కోనేరుల్లో నీళ్లు పుష్కలంగా ఉంటుంది. గుట్టపై రాతి కట్టడాలు, పెద్ద రాతి గోడలు, గుర్రాల కొట్టం, మధ్యలో కాకతీయులు నిర్మించిన దర్వాజాల ఆనవాళ్లు కనిపిస్తాయి. ప్రస్తుతం భోగం దర్వాజా ఉంది.
కురవి: మండలంలోని కందికొండ గ్రామ శివారు కందగిరి(కందికొండ) గుట్టపై శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి జాతర ఈనెల 15న కార్తీక పౌర్ణమి సందర్భంగా వైభవంగా జరగనుంది. అందుకు తగన ఏర్పాట్లు చేయడంతో పాటు భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నారు. కాగా జిల్లా నలుమూలల నుంచే కాకుండా తెలంగాణతో పాటు ఏపీ, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.
స్థల పురాణం..
కందగిరి పర్వత శిఖరంపై పూర్వం కపిలవాయి మహాముని, స్కందుడు అనే మహారుషి ఘోర తపస్సు చేయడం వల్ల శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ప్రత్యక్షమైనట్లు వాడుకలో ఉంది. అందుకే ఈ గుట్టకు స్కందగిరి, కందగిరి నేడు కందికొండ గుట్టగా రూపుదిద్దుకుంది. కందగిరి శిఖరంపై పెద్ద కందిచెట్టు ఉండేదని, అందుకే చరిత్రలో కందికల్ గుట్టలు అనే ప్రస్తావన ఉంది. గుట్టపై ఉన్న ఆలయంలో వల్మీకం(పుట్ట) రూపంలో స్వామివారు వెలిసినట్లు ప్రతీది.
గుట్టపైకి రెండు మార్గాలు..
కందగిరి పర్వతంపైకి వెళ్లేందుకు రెండు మార్గాలున్నాయి. ఒకటి అయ్యగారిపల్లి గ్రామం నుంచి గుట్టపైకి ఉంది. మార్గమధ్యలో గుహలో ఉన్న వేంకటేశ్వరస్వామిని భక్తులు దర్శనం చేసుకుని.. పర్వతశిఖరంపైకి వెళ్తారు. రెండో మార్గం కందికొండ గ్రామం నుంచి ఉంది. ఈ మార్గంలో భక్తులు నేరుగా లక్ష్మీనర్సింహస్వామి వద్దకు వెళ్లి దర్శించుకుంటారు. గుట్టపైకి భక్తులు రాళ్లు, రప్పలు, లోయల నుంచి వెళ్లాల్సి ఉంటుంది. కాగా, అక్కడక్కడ భక్తులు మెట్లను కట్టించారు. కాగా జాతరకు వచ్చే భక్తులకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు వైపులా గుట్ట వద్దకు వచ్చేందుకు రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment