తొర్రూరు ఆర్డీఓ గణేష్
తొర్రూరు ఆర్డీఓ గణేష్
నెల్లికుదురు: రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి లబ్ధి పొందాలని తొర్రూరు ఆర్డీఓ గణేష్ సూచించారు. మండలంలోని రామన్నగూడెం గ్రామంలో సొసైటీ, ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను మంగళవారం రెవెన్యూ అధికారులతో కలిసి సందర్శించి పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కోడిచింతల రాజు, ఆర్‌ఐ రెహమాన్ సిబ్బంది పాల్గొన్నారు.
గ్రూప్–3 పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి
మహబూబాబాద్: జిల్లాలో గ్రూప్–3 పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గ్రూప్–3 పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 21 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, 7,592 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారన్నారు. ఈనెల 17న ఉదయం 10నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మొదటి పేపర్ పరీక్ష ఉంటుందని, 9.30 గంటలకే కేంద్రాల గేట్లు మూసి వేస్తారన్నారు. అదేరోజు సాయంత్రం 3నుంచి 5.30 గంటల వరకు పేపర్–2 పరీక్ష ఉంటుందన్నారు. మధ్యాహ్నం 2.30గంటలలోపు కేంద్రాలకు రావాలన్నారు. ఈనెల 18న ఉదయం 10నుంచి 12:30గంటల వరకు పేపర్–3 పరీక్ష ఉంటుందన్నారు. అభ్యర్థులు ఒరిజినల్ ఐడీలతో పరీక్ష కేంద్రాలకు రావాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
రాజకీయాల్లో కమ్యూనిస్టులే ప్రత్యామ్నాయం
నెహ్రూసెంటర్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలతో ప్రజలు విసిగెత్తిపోయారని, దేశ రాజకీయాల్లో కమ్యూనిస్టులే ప్రత్యామ్నాయం అని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు జి.నాగయ్య అన్నారు. మంగళవారం పార్టీ మహబూబాబాద్ పట్టణ 14వ మహాసభ జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశంలో బీజేపీ అవలంబిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టాలన్నారు. నిరుద్యోగం, పేదరికం, మహిళలపై అత్యాచారాలు దేశంలో పెరిగిపోతున్నా.. రక్షణ కల్పించడంలో బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యహరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, రైతాంగానికి పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాలని, కౌలు రైతులు రైతుభరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇవ్వాలని, పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో మహబూబాబాద్‌లో ఎర్రజెండా ఎగురవేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతీ ఒక్క కార్యకర్త పని చేయాలని అన్నారు. స్థానిక సమస్యలపై పోరాటాలు చేసేలా సన్నద్ధం కావాలని తెలిపారు. మహాసభలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సూర్నపు సోమయ్య, సమ్మెట రాజమౌళి, బానోత్ సీతారాంనాయక్, గాడిపెల్లి ప్రమీల, రావుల రాజు, హేమనాయక్, అల్లి శ్రీనివాస్‌రెడ్డి, చీపిరి యాకయ్య, గౌని వెంకన్న, తోట శ్రీను, వాంకుడోత్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment