లెక్క తేలింది..
సాక్షి, మహబూబాబాద్: జిల్లా వ్యాప్తంగా వ్యవసాయశాఖ అధికారులు నిర్వహించిన సర్వేలో సాగుకుయోగ్యం కాని భూముల లెక్కలు తేల్చారు. దీంతో సాగు భూమి లెక్క సిద్ధమైంది. ఈ జాబితా ప్రకారమే రైతు భరోసా అందనుంది. పంటకు ఎకరానికి రూ.6వేల చొప్పున సంవత్సరానికి రూ.12వేలు అందజేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే మంగళవారం జరిగిన గ్రామ సభల్లో జాబితాను ప్రకటించగా పలుచోట్ల అభ్యంతరాలు రావడం, అధికారులు పక్షపాతంగా లెక్కలు వేశారనే ఫిర్యాదులు కూడా వచ్చాయి.
ఐదు రోజుల సర్వే..
నాలుగు పథకాలను జనవరి 26నుంచి అమలు చేస్తామని ముఖ్యమంత్రి, మంత్రులు ప్రకటించిన నేపథ్యంలో వ్యవసాయ, రెవెన్యూశాఖల అధికారులు జనవరి 16 నుంచి 20వ తేదీ వరకు ఐదు రోజులు సర్వే నిర్వహించారు. ఇందులో భాగంగా ఏఈఓలు, ఏఓలు, ఏడీలు, డీఏఓ బృందాలుగా ఏర్పడి సేకరించిన వివరాలతో తుది జాబితాను సిద్ధం చేశారు. ప్రధానంగా మండలాల వారీగా మొత్తం భూమి ఎంత, ఇందులో వ్యవసాయానికి యోగ్యమైన భూమి ఎంత, యోగ్యంకాని భూమి ఎంత అని గుర్తించారు. ఇందులో ప్రధానంగా ఇల్లు లేదా కాలనీలుగా మారిన వ్యవసాయ భూమి, రి యల్‌ఎస్టేట్, రోడ్డు, పరిశ్రమలు, గోదాంలు, మై నింగ్ మొదలైన అవసరాలకు వినియోగించిన భూమి,వివిధ అవసరాలు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాలయాల కోసం ప్రభుత్వం సేకరించిన భూమితోపాటు, రాళ్లు,రప్పలు, గుట్టలతో నిండి సాగుకు అనుకూలంకాని భూములను గుర్తించారు.
గ్రామసభల్లో పలు ఫిర్యాదులు
వ్యవసాయ, రెవెన్యూ అధికారులు మంగళవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన గ్రామ సభల్లో భూముల వివరాలు ప్రకటించారు. అయితే ఇందులో నెల్లికుదురు, కురవి, దంతాలపల్లి, మరిపెడ, కేసముద్రం మండలాల్లో లెక్కలు తప్పుగా చేశారని పలువురు ఆరోపించారు. వ్యవసాయ, రెవెన్యూ అధికారుల్లో కొందరు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించి జాబితా తయారు చేశారని ఆరోపించారు. దీనిపై జిల్లా వ్యవసాయశాఖ అధికారి విజయ నిర్మలను వివరణ కోరగా గ్రామ సభల్లో ఫిర్యాదులు వచ్చిన మాట వాస్తవమే.. ఎక్కడైనా తప్పు జరిగితే పూర్తి వివరాలతో ఫిర్యాదు చేయాలని, తహసీల్దార్, ఏఓలు పరిశీలించి తప్పు అని తేలితే రైతు భరోసా జాబితా నుంచి భూమిని తొలగిస్తామని చెప్పారు.
సాగుకు యోగ్యంకాని భూముల వివరాలు వెల్లడి
8,232 ఎకరాలుగా గుర్తింపు
ఈ లెక్కల ఆధారంగానే రైతు భరోసా
ఇందులో కూడా తప్పులు
ఉన్నాయని ఆరోపణలు
ఫిర్యాదు చేస్తే తొలగిస్తామన్న అధికారులు
జిల్లాలోని భూమి వివరాలు(ఎకరాలు)..
వ్యవసాయ యోగ్యమైన భూమి: 3,69,859
ఇల్లు, కాలనీగా మారిన భూమి: 772
రియల్‌ఎస్టేట్, పరిశ్రమలు, గోదాం,
మైనింగ్‌కు వినియోగించిన భూమి: 2,863
వివిధ అవసరాలకోసం ప్రభుత్వం
సేకరించిన భూమి: 479
రాళ్లు, గుట్టలతో ఉన్న భూమి : 3,431
ఇతర కారణాలతో సాగుకు
పనికి రాని భూమి: 687
వ్యవసాయానికి యోగ్యం కాని
మొత్తం భూమి: 8,232
Comments
Please login to add a commentAdd a comment