మహబూబ్‌నగర్: ఓ యాప్‌ను ఉపయోగించి సెల్ నంబర్ కనిపించకుండా ఎవరికై నా ఫోన్ చేసే అవకాశం ఉంది. ఆ యాప్‌ను ఉపయోగించి ఉద్యోగినిని తరుచుగా ఫోన్‌లో వేధిస్తున్న యువకుడిని గుర్తించి పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన జడ్చర్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది.
సీఐ రమేశ్‌బాబు కథనం ప్రకారం.. జడ్చర్లకు చెందిన ఎక్సైజ్ మహిళా కానిస్టేబుల్ నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండల కేంద్రంలోని మద్యం డిపోలో విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో తన ఫోన్‌కు ఓ గుర్తు తెలియని ఫోన్ నంబర్‌తో ఓ వ్యక్తి మాట్లాడుతూ తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చాడు. ఫోన్ చేసిన ప్రతి సారీ విదేశాల మాదిరిగా కొత్త నంబర్ రావడంతో ఎక్కడి నుంచి ఫోన్ వచ్చిందో తెలియని పరిస్థితి.
5 నెలలుగా ఫోన్‌లో వేధింపులు భరించిన యువతి అపరిచిత వ్యక్తిని ఎలా గుర్తించాలో తెలియని సంకటస్థితిలో మానసిక వేదనకు గురైంది. తాను ఎప్పుడు ఎక్కడ ఉన్న విషయం ఫోన్‌లో వివరిస్తుండడంతో ఆశ్చర్యం, అయోమయం ఏర్పడింది. అసభ్యంగా మాట్లాడడంతో పాటు తాను ప్రేమిస్తున్నానని, తనను పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి చేయడంతో ఈ విషయాన్ని ఆమె భర్తకు వివరించింది.
ఓ సారి భర్త కూడా ఫోన్ వచ్చిన సమయంలో అతనితో మాట్లాడినా అతనిలో మార్పు రాలేదు. ఫోన్‌లో వేధింపులు ఎక్కువయ్యాయి. మద్యం డిపోలో పనిచేస్తున్న కూలీలను, ఉద్యోగులను అనుమానించినా గుర్తించే పరిస్థితి లేకపోయింది. చివరకు సదరు వ్యక్తికి అనుమానం రాకుండా తాను కూడా ప్రేమిస్తున్నానంటూ నమ్మబలికింది. పెళ్లి చేసుకుందామని నమ్మించి అతనిని గుర్తించి ఒక్కసారిగా అవాక్కైంది. ఇన్నాళ్లు తనను ఫోన్‌లో వేధించిన వ్యక్తి తాను పనిచేసే మద్యం డిపోలో హమాలీ నాగరాజుగా గుర్తించడంతో వెంటనే జడ్చర్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి తిమ్మాజీపేటకు బదిలీ చేశామని సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment