మహబూబ్‌నగర్: సొంత మేనల్లుడే ప్రత్యర్థిగా మారి సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకునే స్థాయిలో వారి మధ్య రాజకీయ వైరం ఏర్పడింది. ప్రస్తుతం బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఎమ్మెల్యే ఎన్నికపై హైకోర్టు తీర్పు సంచలనం రేపగా.. డీకే వర్సెస్ బండ్ల మధ్య నెలకొన్న రాజకీయ వైరం ఉమ్మడి పాలమూరు జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది.
మాజీ ఎమ్మెల్యే డీకే భరత్‌సింహారెడ్డికి సొంత అక్క కొడుకే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి. డీకే భరత్‌సింహారెడ్డి 1994లో ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మేనల్లుడైన బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని చేరదీశారు. ఈ క్రమంలో ఆయన అటు రాజకీయంగా, ఇటుఅధికార వ్యవహారాల్లో అన్నీ తానై చక్రం తిప్పారు. ఒకానొక దశలో గద్వాలలో షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తు న్నాడనే గుసగుసలు సైతం విన్పించాయి.
అయితే 1999లో గద్వాల పట్టణంలో కరాటే శ్రీను హత్య రాష్ట్రంలో సంచలనం సృష్టించగా.. రాజకీయ దుమారం చెలరేగింది. 1999లో శాసనసభ ఎన్నికల్లో గట్టు భీముడి చేతిలో డీకే భరత్‌సింహారెడ్డి భార్య డీకే అరుణ ఓటమిపాలు కాగా.. రాజకీయ పరిణామాలు చకచకా మారిపోయాయి. తన ఓటమికి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డే కారణమని భావించి.. డీకే కుటుంబం ఆయనను రాజకీయాల నుంచి దూరం పెట్టడంతో విభేదాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment