
మహబూబ్‌నగర్: చిచ్చా బాగున్నావా.. మావా ఎక్కడ పోతున్నావ్.. ఓ అక్కా నీ బిడ్డ మంచిగ చదువుతుండా.. మొన్న వడ్లు ఎన్ని పండినాయి... తాతా పాణం బాగుందా.. ఇలా రకరకాల పలకరింపులతో గ్రామాలు పులకరిస్తున్నాయి. ఎప్పుడు కోడి కూతతో లేచే ఊరు కాస్తా ఈ మధ్య కొత్త కొత్త నాయకుల పలకరింపులతోనే నిద్ర లేస్తుండటం విశేషం. ఉదయం లేవగానే కొత్త కొత్త మనుషులు.
కొత్త వరుసలతో పలకరించటంతో జనం ఉబ్బి తబ్బిపోతున్నారు. కొందరు ఇదేంరా బాబు ఎన్నడూ లేని వీడు వరుస కలుపుతున్నాడంటూ లోలోనే గొనుగుతున్నారు. ఓటర్లకు దగ్గరయ్యేందుకు వివిధ పార్టీల నాయకులు వరుసలు కలిపేస్తూ జనాలను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాగా కొందరు వీరి జిమ్మికులు మాకు తెలుసులే అని అంటున్నారు.