భరోసా సెంటర్‌తో మహిళలకు రక్షణ
పాలమూరు: భరోసా సెంటర్ ద్వారా బాధిత మహిళలకు రక్షణ కల్పించడంతోపాటు వారికి అవసరమైన న్యాయ సహాయం అందించడం జరుగుతుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని మోనప్పగుట్టలో నూతనంగా నిర్మించిన భరోసా సెంటర్ భవనాన్ని మంగళవారం ఎంపీ డీకే అరుణ, కలెక్టర్ విజయేందిర, ఎస్పీ జానకి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి చిన్నారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భరోసా సెంటర్ల ద్వారా మహిళలకు పూర్తి సంరక్షణ కల్పించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. మహిళలు, బాలికలపై జరిగే అత్యాచారాలు, అఘాయిత్యాలు, పోక్సో కేసులలో ఈ సెంటర్ ద్వారా న్యాయం, సహకారం అందించి భరోసా కల్పిస్తారన్నారు. మహిళలు ప్రతిఒక్కరూ భరోసా సెంటర్ ద్వారా లభించే సేవలు, సదుపాయాలతోపాటు కేసు నమోదు లాంటి విషయాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. బాధిత మహిళలు ధైర్యంగా పోలీస్‌స్టేషన్ లేదా భరోసా సెంటర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. మెగా కంపెనీ వారు రూ.2.10 కోట్లతో భవనం నిర్మించడం గొప్ప విషయమన్నారు. ఎస్పీ జానకి మాట్లాడుతూ భరోసా కేంద్రం అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, మహిళా భద్రత విభాగం హైదరాబాద్ నియంత్రణలో నడుస్తుందన్నారు. భరోసా సెంటర్ ద్వారా బాధితులు ఒకేచోట అనేక రకాలసేవలు పొందవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, ఉమెన్ సేఫ్టివింగ్ ఎస్పీ అశోక్‌కుమార్, ఏఎస్పీ రాములు, ఏఆర్ ఏఎస్పీ సురేష్‌కుమార్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, డీసీఆర్‌బీ డీఎస్పీ రమణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత, వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యులు జగపతిరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment