మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఓపెన్ పీజీ పరీక్షలు బుధవారం నుంచి నిర్వహిస్తున్నట్లు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రీజినల్ కోఆర్డినేటర్ సత్యనారాయణగౌడ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్‌టికెట్, ఫీజు రిసిప్టు, ఐడీ కార్డు తీసుకురావాలని, పూర్తి వివరాల కోసం సెల్ నం.73829 29609ను సంప్రదించాలని సూచించారు.
నేడు ఏషియన్ నెట్‌బాల్ సెలక్షన్స్ ట్రయల్స్
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో ఆదివారం వచ్చే ఏడాది జూన్‌లో కొరియాలో జరిగే ఏషియన్ యూత్ నెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే మహిళా జట్టు, న్యూఢిల్లీలో వచ్చే ఏడాది మే నెలలో జరిగే ఏషియన్ మెన్ నెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే పురుషుల జట్టు సెలక్షన్స్ ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు నెట్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్ష, కార్యదర్శులు విక్రమాదిత్యరెడ్డి, ఖాజాఖాన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే వచ్చే ఏడాది జనవరిలో ఉత్తరాఖండ్‌లో జరిగే 38వ జాతీయ క్రీడల్లో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర నెట్‌బాల్ జట్ల ఎంపికలు ఉంటాయన్నారు. జాతీయ క్రీడలకు తెలంగాణ నుంచి ట్రెడిషనల్ నెట్‌బాల్ పురుషులు, మహిళలు, ఫాస్ట్–5 పురుషులు, మహిళలు, మిక్స్‌డ్ అంశాల్లో రాష్ట్ర జట్లు అర్హత సాధించాయని, ఈ మేరకు క్రీడల్లో పాల్గొనే ఐదు జట్ల క్రీడాకారులను ఎంపిక చేస్తామన్నారు. ఈ ఎంపికల్లో పాల్గొనేవారు 2024– 25 సంవత్సరానికి గాను భారత నెట్‌బాల్ సమైక్యలో పేర్లు నమోదు చేసుకొని ఉండాలన్నారు. ఉదయం 9 గంటలకు ఇన్‌చార్జ్ సోహైల్‌ఖాన్‌కు నివేదించాలని సూచించారు. ఈ ఎంపికలకు డీవైఎస్‌ఓ శ్రీనివాస్ పరిశీలకుడిగా వ్యవహరిస్తారని చెప్పారు.
ఆర్‌ఎన్‌ఆర్ క్వింటాల్ రూ.2,829
జడ్చర్ల/ దేవరకద్ర: బాదేపల్లి మార్కెట్‌లో ధాన్యం ధరలు ఎగబాకుతున్నాయి. శనివారం మార్కెట్ యార్డులో ఆర్‌ఎన్‌ఆర్ క్వింటాల్ గరిష్టంగా రూ.2,829, కనిష్టంగా రూ.1,506 ధర లు దక్కాయి. మొక్కజొన్న క్వింటాల్ గరిష్టంగా రూ.2,421, కనిష్టంగా రూ.2,011, హంసగరిష్టంగా రూ.1,929, కనిష్టంగా రూ.1,837, పత్తి గరిష్టంగా రూ.6,690, కనిష్టంగా రూ.6,060, వేరుశనగ గరిష్టంగా రూ.6,690, కనిష్టంగా రూ.5,680 ధరలు లభించాయి.
● దేవరకద్ర మార్కెట్ యార్డులో ఆర్‌ఎన్‌ఆర్ వరిధాన్యం ధర క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2,666, కనిష్టంగా రూ.1,911 లభించింది. 2 వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది.
నేడు మిషన్ భగీరథ
నీటి సరఫరా బంద్
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): నారాయణపేట జిల్లా కోస్గిలోని చౌరస్తాలో జాతీయ రహదారి–167 డివైడింగ్ కారణంగా మిషన్ భగీరథ పైప్‌లైన్ మార్చడం వల్ల ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు 24 గంటల పాటు నీళ్ల సరఫరా బంద్ చేయనున్నట్లు మిషన్ భగీరథ ఈఈ వెంకట్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దీని కారణంగా కోస్గి మున్సిపాలిటీ, గుండుమాల్, కొత్తపల్లి, మద్దూరు మండలాలకు నీళ్ల సరఫరా నిలిచిపోతుందని, ఈ అసౌకర్యానికి ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.
26న ఉమ్మడి జిల్లా
సాఫ్ట్‌బాల్ జట్ల ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో మంగళవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి జిల్లాస్థాయి అండర్–17 విభాగం బాలబాలికల సాఫ్ట్‌బాల్ జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి శారదాబాయ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ మొదటి వారంలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్ అండర్–17 సాఫ్ట్ బాల్ టోర్నీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంపికల్లో పాల్గొనేవారు పాఠశాల బోనఫైడ్, ఆధార్ కార్డు జిరాక్స్‌లతో ఉదయం 9 గంటలకు హాజరుకావాలని కోరారు. మిగతా వివరాల కోసం పీడీలు నాగరాజు (99592 20075), రాఘవేందర్ (99590 16610) నంబర్‌ను సంప్రదించాలని ఆమె సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment