కిటకిటలాడిన కురుమూర్తిగిరులు
చిన్నచింతకుంట: అమ్మాపురం కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం సెలవురోజు కావడంతో వివిధ ప్రాంతాల భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ అర్చకులు తెల్లవారుజామున ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతించారు. భక్తులు ఉదయం నుంచే క్యూలైన్‌లో నిల్చొని స్వామివారిని దర్శించుకున్నారు. కొందరు భక్తులు కోనేటిలో స్నానాలు ఆచరించి తడి దుస్తులతో మెట్లపై దీపాలు వెలిగించగా.. మరికొందరు కొబ్బరికాయలు కొట్టి దాసాంగాలు సమర్పించి గండదీపాలు మోసి మొక్కులు తీర్చుకున్నారు. అలువేలుమంగ, ఆంజనేయస్వామి, చెన్నకేశవస్వామి, ఉద్దాల మండపంలో భక్తుల రద్దీ కనిపించింది. జాతర మైదానంలో వెలిసిన దుకాణాల్లో భక్తులు మిఠాయిలు, పిల్లలకు ఆట వస్తువులు, గాజులు కొనుగోలు చేశారు.
జోరుగా మాంసం విక్రయాలు..
జాతరలో లభించే కాల్చిన మాంసం ఆరగించేందుకు వివిధ ప్రాంతాల వారు తరలివచ్చారు. ఆదివారం సెలవురోజు కావడంతో రద్దీ బాగా ఉంది.
భక్తుడిపై ఎస్‌ఐ దాడి
కురుమూర్తిస్వామి దర్శనానికి వచ్చిన పర్ధిపూర్ గ్రామానికి చెందిన రాములు తనపై ఎస్‌ఐ శేఖర్ దాడి చేశాడని ఆరోపించారు. వివరాలు రాములు ఆదివారం కురుమూర్తిస్వామి దర్శనానికి రాగా.. జాతర ప్రాంగణంలోని బైపాస్ రోడ్డు వద్ద ఎస్‌ఐ అడ్డగించి దాడికి పాల్పడటంతో మొఖం పైభాగంతోపాటు వీపులో గాయాలయ్యాయని వాపోయాడు. ఈ విషయమై ఎస్‌ఐ స్పందిస్తూ భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని ద్విచక్రవాహనాన్ని మాత్రమే ఆపానని, దాడి చేయలేదని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment