‘సాయిరెడ్డిది రేవంత్ కుటుంబం చేసిన హత్య’
కల్వకుర్తి టౌన్/ వెల్దండ: నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డిది ఆత్మహత్య కాదని.. అది పూర్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ కుటుంబం చేసిన హత్య అని బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. ఆదివారం ఆయన కల్వకుర్తిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో సాయిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కల్వకుర్తితోపాటు వెల్దండలో ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల వేధింపులు తాళలేకనే ఆత్మహత్య చేసుకుంటున్నానని లేఖ రాసి చనిపోయాడంటే వారి అరాచకాలు ఏ స్థాయికి చేరాయో అర్థం చేసుకోవాలన్నారు. సీఎం స్వగ్రామంలో మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని, దీనికి ముఖ్యమంత్రి బాధ్యత వహించాలన్నారు. రాష్ట్ర డీజీపీ వెంటనే స్పందించి సాయిరెడ్డిని ఆత్మహత్యకు ప్రేరేపించిన వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లగచర్ల ఘటనలో అనేక విషయాలు బయటకు వస్తున్నాయని, పేదలు, రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుతానికి సమయం వచ్చినప్పుడు తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
ఉమ్మడి జిల్లాలో 120 మంది హోంగార్డుల బదిలీ
మహబూబ్‌నగర్ క్రైం: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పనిచేస్తూ మూడేళ్లు పూర్తి చేసుకున్న హోంగార్డులను బదిలీ చేశారు. జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, నారాయణపేట జిల్లాలో పనిచేస్తూ మూడేళ్లు పూర్తి చేసుకున్న హోంగార్డులను మహబూబ్‌నగర్‌కు బదిలీ చేస్తూ.. ఇక్కడ ఉన్నవారిని ఆయా జిల్లాలకు బదిలీ చేయడం జరిగింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 120 మంది హోంగార్డులను బదిలీ చేస్తూ ఆయా జిల్లాలకు కేటాయించారు. ఈ బదిలీల ప్రక్రియపై మహబూబ్‌నగర్ ఎస్పీ కార్యాలయంలో ఉన్నతాధికారులు ప్రత్యేక కసరత్తు నిర్వహించి జిల్లాల వారిగా పోస్టింగ్‌లు ఇచ్చారు. బదిలీ అయిన హోంగార్డులు రెండు రోజుల్లో కేటాయించిన స్థానాలకు వెళ్లనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment