‘పాలమూరు’ ప్రాజెక్టును పూర్తిచేయాలి
మహబూబ్‌నగర్ న్యూటౌన్: జిల్లాలోని అమిస్తాపూర్‌లో నిర్వహించే రైతు సదస్సుకు హాజరవుతున్న సీఎం రేవంత్‌రెడ్డి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపాలని, ప్రధానంగా పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు సత్వరమే పూర్తి చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రాములు అన్నారు. సోమవారం స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉదండాపూర్ నిర్వాసితులకు పరిహారం పెంచాలని, రైతు రుణమాఫీ ప్రతి రైతుకు అమలు చేయాలని, రైతు భరోసా డబ్బులు వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలన్నారు. పాలకుల నిర్లక్ష్యం కారణంగా పాలమూరు ప్రాజెక్టు పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారిందని దుయ్యబట్టారు. కొడంగల్– నారాయణపేట ఎత్తిపోతలపై ఉన్న ప్రేమ పాలమూరు ప్రాజెక్టుపై ముఖ్యమంత్రికి లేదని ఆరోపించారు. ఉపాధి హామీ పనిదినాలను 200 రోజులకు పెంచాలని, కూలీ రూ.600 ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. సమావేశంలో సీనియర్ నాయకులు కిల్లె గోపాల్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు నల్లవెల్లి కురుమూర్తి, జిల్లా కమిటీ సభ్యులు రాజ్‌కుమార్, నాయకులు చంద్రకాంత్, మోహన్, దీప్లానాయక్, భరత్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment