బాధ్యులెవరు..?
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తిని విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న సంఘటనలు కలకలం రేపుతున్నాయి. బుధవారం నారాయణపేట జిల్లా మాగనూర్‌లోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న పలువురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. అయితే ఇందుకు బాధ్యులైన పలువురు అధికారులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటువేసింది. సంఘటన జరిగిన ప్రతిసారి ఏదో ఒక అధికారిపై చర్యలు తీసుకోవడం తర్వాత వదిలేయడంతో సమస్య పూర్తిస్థాయిలో పరిష్కారం లభించడం లేదు. ఫలితంగా నిత్యం ఎక్కడో ఒకచోట నాణ్యత లేని ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న సంఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు తినే మధ్యాహ్న భోజన బియ్యం నాణ్యతా ప్రమాణాలు లేకుండా సరఫరా చేస్తుండటమే ఇందుకు కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా..
సివిల్ సప్లయ్ అధికారులు ఎక్కువకాలం గోడౌన్‌లలో నిల్వ చేసిన బియ్యాన్ని పాఠశాలలకు సరఫరా చేస్తున్నట్లు పలువురు హెచ్‌ఎంలు పేర్కొంటున్నారు. ఈ బియ్యాన్ని కొన్ని రోజులపాటు పాఠశాలలోనూ నిల్వ ఉంచడంతో పురుగులు పడుతున్నట్లు తెలుస్తుంది. వారంలో ఒక్కసారి సీఆర్పీ (క్లస్టర్ రీసోర్సుపర్సన్) పరిశీలించి కేవలం వారం లేదా పదిరోజులకు బియ్యం నిల్వ ఉండేలా మాత్రమే చూడాలి. కానీ, పాఠశాలల్లో క్వింటాళ్ల కొద్ది బియ్యం నిల్వలు ఉండడం వల్ల అక్కడ చాలా వరకు పాడైపోయి పురుగులు పట్టి చిట్టెలు కట్టే పరిస్థితి నెలకొంది. జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో క్వింటాళ్ల కొద్ది బియ్యం నిల్వలు ఉన్నట్లు తెలుస్తుంది. చాలా బియ్యం పాడైపోవడంతో నెలల త్వరబడి వాటిని వినియోగించకుండా మూలకు పడేస్తున్నారు.
రీసైకిల్ చేసి సరఫరా..?
ఎక్కువకాలం బియ్యం గోడౌన్‌లలో, పాఠశాలలో నిల్వ ఉండటం వల్ల పురుగులు పడుతున్నాయి. మంచి బియ్యాన్ని సివిల్ సప్లయ్ వారు సరఫరా చేస్తే నేరుగా వాటిని ఏజెన్సీ వారు వండి వడ్డించే అవకాశం ఉంది. కానీ, ప్రతి పాఠశాలలో కూడా చాలా వరకు నిల్వ ఉన్న బియ్యమే వాడుతున్నారు. అయితే ఏజెన్సీ వారు ప్రతిరోజు కూడా వాటిని జల్లెడ ఆడించి వండాల్సి వస్తుంది. అయినప్పటికీ కొన్నిచోట్ల పురుగులు వస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్నిచోట్ల దొడ్డు బియ్యాన్ని రీసైకిల్ చేసి సన్నగా మార్చిన వాటిని పాఠశాలలకు సరఫరా చేయడంతో బియ్యాన్ని కడుగుతుంటేనే అవి రెండుగా విరిగిపోతున్నట్లు ఏజెన్సీ వారు ఆరోపిస్తున్నారు. దీంతో అన్నం నూకలుగా మారడం, ముద్ద ముద్ద అవుతున్నట్లు తెలుస్తుంది. ఫలితంగా కొన్నిసార్లు వంట ఏజెన్సీలు సైతం బాధితులుగా మారుతున్నారు. ఏకంగా అక్షయ పాత్ర వారు సరఫరా చేస్తున్న అన్నం సైతం ఉడికి ఉడకనట్లు ఉండడం, కూరలు, సాంబార్ వంటి వాటిలో నాణ్యత లేకపోవడం వంటివి చోటుచేసుకుంటున్నాయి. ఉదయం వండి.. మధ్యాహ్నానికి పాఠశాలలకు పంపించడంతో నాణ్యత దెబ్బతింటున్నట్లు సమాచారం. జిల్లావ్యాప్తంగా మొత్తం 6 మండలాల్లో అక్షయపాత్ర ద్వారా భోజనం అందిస్తున్నారు.
పేద విద్యార్థులు ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చించి.. మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తోంది. ఎంతో సదుద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ పథకం కొందరు అధికారులు వ్యవహరిస్తున్న తీరుతో అభాసుపాలవుతోంది. ఒకవైపు పురుగులు పట్టి, చిట్టెలు కట్టి.. ముక్కిన బియ్యం.. మరోవైపు కుళ్లిన కూరగాయలు, అపరిశుభ్ర వాతావరణంలో వంటలు వండి విద్యార్థులకు వడ్డిస్తుండటంతో.. వారు వాంతులు, విరేచనాలు చేసుకుంటూ ఆస్పత్రుల పాలవుతున్నారు.. దీనికి ప్రధానంగా బాధ్యులు ఎవరు అనేది పక్కనపెడితే.. అనారోగ్యం బారినపడి విద్యార్థులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
మధ్యాహ్న భోజనంబియ్యంలో నాణ్యత డొల్ల
సివిల్ సప్లయ్ నుంచే
పురుగులు పట్టినవి సరఫరా?
ఎక్కువ కాలం గోడౌన్, బడుల్లో నిల్వ ఉండటంతో పాడవుతున్న వైనం
చాలా పాఠశాలల్లో క్వింటాళ్ల కొద్దిపాడైన బియ్యం
అనారోగ్యం బారిన విద్యార్థులు..అభాసుపాలవుతున్న వంట ఏజెన్సీలు
Comments
Please login to add a commentAdd a comment