అడ్డు తొలగేనా..?! | - | Sakshi
Sakshi News home page

అడ్డు తొలగేనా..?!

Published Tue, Nov 26 2024 1:25 AM | Last Updated on Tue, Nov 26 2024 1:25 AM

అడ్డు తొలగేనా..?!

అడ్డు తొలగేనా..?!

సాక్షి, నాగర్‌కర్నూల్‌: మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం విస్తరణ పనులు సుమారు 20 ఏళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తిచేసేందుకు భూసేకరణ ప్రక్రియ ప్రధాన సమస్యగా మారింది. భూములు కోల్పోతున్న రైతులకు సకాలంలో న్యాయమైన పరిహారం అందించాల్సి ఉండగా.. ఏళ్ల తరబడి తీవ్ర జాప్యం కొనసాగుతోంది. భూసేకరణ పూర్తయిన చోట ఇప్పటికీ పరిహారం అందక రైతులు నిరీక్షిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల కన్నా ముందుగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పనులను పూర్తిస్థాయిలో చేపట్టాలని నిర్ణయించింది. ప్రాధాన్యతా క్రమంలో కేఎల్‌ఐతో పాటు మార్కండేయ, అచ్చంపేట ఎత్తిపోతల, డిండి, ఎస్‌ఎల్‌బీసీ ఎత్తిపోతల పథకాల పనులను పూర్తిచేసి, సాగునీటి సరఫరా ప్రారంభించాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. అయితే అందుకు అత్యంత కీలకమైన భూసేకరణ పనుల్లో మాత్రం పురోగతి ఉండటం లేదు.

20 ఏళ్లుగా పెండింగ్‌లోనే..

కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద కాల్వల నిర్మాణం 2005లో చేపట్టగా.. పూర్తిస్థాయి పనులు ఇప్పటికీ పూర్తికాలేదు. ఉమ్మడి జిల్లాలోని కొల్లాపూర్‌, నాగర్‌కర్నూల్‌, అచ్చంపేట, కల్వకుర్తి, జడ్చర్ల, వనపర్తి నియోజకవర్గాల పరిధిలో సుమారు 4.50 లక్షల ఎకరాలకు సాగునీరందించాలనే లక్ష్యంతో ఈ ఎత్తిపోతల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. అయితే ఏళ్లుగా పూర్తిస్థాయి నిర్మాణానికి నోచుకోకపోవడంతో, సగం మేర ఆయకట్టుకే పరిమితమైంది. ప్రస్తుతం 3.07 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయి పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లు నిర్మించని కారణంగా పూర్తిస్థాయి లక్ష్యం నెరవేరడం లేదు. అలాగే విస్తరణ పనుల కింద చేపట్టాల్సిన పనులు ఇంకా మొదలుపెట్టలేదు. ఇందుకు భూసేకరణ చేపట్టాల్సి ఉండగా, ఈ ప్రక్రియ సంక్లిష్టంగా మారుతోంది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం 27, 28, 29, 30 ప్యాకేజీల్లో కలిపి మొత్తం 143 ఎకరాల వరకు భూసేకరణ చేపట్టాల్సి ఉంది. ఈ ప్రక్రియలో విడతల వారీగా పనులు చేపట్టారు. అయితే 20 ఏళ్లు గడుస్తున్నా పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. కేఎల్‌ఐ 28వ ప్యాకేజీ కింద 84 కి.మీ., 29వ ప్యాకేజీ కింద 160 కి.మీ., 30వ ప్యాకేజీ కింద 80 కి.మీ. మేర కొత్తగా కాల్వలను తవ్వాల్సి ఉంది. తర్వాతి దశలో 30వ ప్యాకేజీ కింద కల్వకుర్తి నియోజకవర్గంలోని మాడ్గుల్‌ మండలం వరకు ఆయకట్టు విస్తరించేలా డిస్ట్రిబ్యూటరీ కాల్వలను నిర్మించాలని ప్రతిపాదించారు. 29వ ప్యాకేజీ కింద డీ–82 కెనాల్‌ విస్తరణలో సుమారు 37 ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రణాళికలు రూపొందించినా.. ఇందుకు అవసరమైన పనులు ముందుకు సాగడం లేదు. మరోవైపు డిస్ట్రిబ్యూటరీ చానళ్ల నిర్మాణం సైతం పూర్తికాకపోవడం.. ఉన్న కాల్వలకు లైనింగ్‌ పనులు చేపట్టకపోవడంతో ఆయకట్టు రైతులకు సరిపడా సాగునీరు అందడం లేదు.

మార్కండేయ, అచ్చంపేట ఎత్తిపోతలకు సైతం..

సుమారు 7 వేల ఎకరాలకు పైగా సాగునీరు అందించేందుకు బిజినేపల్లి మండలం శాయినిపల్లి వద్ద చేపట్టిన మార్కండేయ ప్రాజెక్టుకు భూసేకరణ పూర్తికాకపోవడంతో పనులు నిలిచిపోయాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే సమీపంలో 14 గ్రామాలు, తండాల రైతులకు సాగునీరు అందనుంది. అచ్చంపేట బ్రాంచ్‌ కెనాల్‌ విస్తరణ ద్వారా ఉప్పునుంతల మండలం వరకు సుమారు 15 వేల ఎకరాలకు సాగునీరు అందేలా చేపట్టిన పనులు సైతం భూసేకరణ అడ్డంకితోనే ప్రారంభానికి నోచుకోవడం లేదు.

ప్రధాన అడ్డంకిగా మారిన భూసేకరణ ప్రక్రియ

ముందుకు సాగని

ఎంజీకేఎల్‌ఐ పెండింగ్‌ పనులు

ప్యాకేజీ 29, 30 విస్తరణకు పూర్తికాని 143 ఎకరాల భూసేకరణ

రైతులకు నష్టపరిహారం

అందించడంలో తీవ్ర జాప్యం

ఏళ్లుగా పూర్తి ఆయకట్టుకు

అందని సాగునీరు

పనుల వేగవంతానికి చర్యలు..

కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పెండింగ్‌ పనుల కోసం భూసేకరణ ప్రక్రియ విడతల వారీగా కొనసాగుతోంది. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు భూసేకరణ వేగవంతం చేసేందుకు రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారుల సమన్వయంతో కృషి చేస్తున్నాం. వారానికోసారి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహిస్తాం.

– సీతారామారావు, అడిషనల్‌ కలెక్టర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement