రైతు సదస్సుకు పకడ్బందీగా ఏర్పాట్లు
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ఈ నెల 28 నుంచి 30 వరకు నిర్వహించ తలపెట్టిన రైతు సదస్సు కార్యక్రమానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ, సహకార శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు అన్నారు. సోమవారం భూత్పూర్ మండలంలోని అమిస్తాపూర్‌లో రైతు సదస్సు ఏర్పాట్లను కలెక్టర్ విజయేందిర, ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతు సదస్సుతోపాటు 30న నిర్వహించనున్న సీఎం సభావేదిక ఏర్పాట్లను పరిశీలించి సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎస్పీ జానకి, అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యమొద్దు
ప్రజల సమస్యలపై ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు 80 అర్జీలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. సోమవారం వచ్చిన 80 ఫిర్యాదులపై ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. అలాగే సమగ్ర ఇంటింటి సర్వే పూర్తి అయినందున వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు ప్రారంభించి.. ఈనెల 30లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. సర్వేలో వివరాలు నమోదు చేసుకోని వారు ఉంటే పంచాయతీ కార్యదర్శులు, వార్డు అధికారుల ద్వారా మాప్ ఆఫ్ రౌండ్ నిర్వహించి వివరాలు నమోదు చేయాలన్నారు. ఎలాంటి తప్పులు జరగకుండా ఎన్యుమరేటర్లు సేకరించిన సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పొందుపరచాలని కలెక్టర్ సూచించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ద్వారా అన్ని గ్రామాల్లో మంగళవారం ప్రజా విజయోత్సవాలు నిర్వహించి ఈజిఎస్ పనులు మంజూరు చేయాలని ఆదేశించారు. గురువారం నుంచి శనివారం వరకు భూత్పూర్ మండలం అమిస్తాపూర్‌లో రైతు సదస్సు నిర్వహణ, శనివారం భారీ బహిరంగ సభ ఉంటుందని, ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొంటారని చెప్పారు. ఇందుకు సంబంధించి వ్యవసాయ, అనుబంధ శాఖలచే 150కిపైగా స్టాళ్లు ఏర్పాటు చేసి అధునాతన వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం, యంత్రాలు ప్రదర్శనలు, లైవ్ డెమో నిర్వహిస్తారని చెప్పారు. స్టాళ్ల ఇన్‌చార్జ్‌గా డీఎఫ్‌ఓ, డీఆర్‌ఓ సమన్వయ అధికారిగా వ్యవహరిస్తారని, అదనపు కలెక్టర్లు పర్యవేక్షించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మోహన్‌రావు, జెడ్పీసీఈఓ వెంకటరెడ్డి, డీఆర్‌డీఓ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment