పల్లె సమరానికి సమాయత్తం
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): పంచాయతీ అధికారుల హడావుడి చూస్తుంటే ‘స్థానిక’ ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు అన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ మేరకు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు. వచ్చే ఏడాది జనవరి 30లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఒకవైపు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహిస్తున్న అధికారులు.. మరోవైపు ఓటరు జాబితా, ఇతరత్రా వ్యవహారాలను చక్కబెడుతున్నారు. ఇప్పటికే గ్రామ పంచాయతీలకు సంబంధించి వార్డుల వారీగా ఫొటోతో కూడిన ఓటరు జాబితాలను సిద్ధం చేసి ఆయా పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శించారు. ఎన్నికల నిర్వహణలో కీలకమైన బ్యాలెట్ బాక్సులను సైతం సిద్ధం చేశారు. అయితే జిల్లాలో సరిపడా బాక్సులు అందుబాటులో లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించేందుకు కృషిచేస్తున్నారు.
3,836 పోలింగ్ స్టేషన్లు
జిల్లాలో 5,16,360 గ్రామీణ ఓటర్లు ఉండగా.. కొత్తగా చేరిన 11,123 మందితో కలిపి 5,27,483 ఓటర్లు ఉన్నారు. ఈ నెల 25న ఓటరు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో ఏమైనా అభ్యంతరాలు ఉంటే సరిచేసుకునే అవకాశం ఉంది. తుది జాబితా ఈ నెల 30న విడుదల చేయనున్నారు. జిల్లాలో 3,836 వార్డులు ఉండగా.. ఎన్నికల నిర్వహణ కోసం వార్డుకు ఒకటి చొప్పున పోలింగ్ కేంద్రాలు ఎంపిక చేశారు. ఎన్నికల రోజు వరకు పోలింగ్ కేంద్రాల్లో ర్యాంపుల నిర్మాణం, వీల్‌చైర్లు అందుబాటులోకి తీసుకురావడం, విద్యుత్, తాగునీరు తదితర సౌకర్యాలు కల్పించేలా ఏర్పాట్లు చేయనున్నారు.
డీపీఓ కార్యాలయానికి సామగ్రి
జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన శిక్షణ సామగ్రి జిల్లా పంచాయతీ కార్యాలయానికి చేరుకుంది. ఇందులో ఆర్‌ఓ, ఏఆర్‌ఓ, పీఓలు, ఏపీఓలు, పోలింగ్ క్లర్క్‌ల విధి విదానాలు తెలియజేసే ఎన్నికల సామగ్రి ఉంది. ఎన్నికల్లో ఆర్‌ఓ నుంచి పోలింగ్ క్లర్క్ వరకు ఏం చేయాలనే నియమ నిబంధనలు ఇందులో ఉన్నాయి.
సిద్ధంగా ఉన్నాం..
పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఓటరు జాబితా వార్డుల వారిగా మ్యాపింగ్ జరుగుతుంది. ఈ నెల30న తుది జాబితా విడుదల చేస్తాం. ఈ జాబితా ప్రకారం ఎన్నికల నిర్వహణ చేపడుతారు.
– పార్థసారధి, డీపీఓ
మూడు విడతల్లో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ నిర్ణయం?
వచ్చే ఏడాది జనవరిలోగాపూర్తిచేసేందుకు కసరత్తు
ఇప్పటికే 11,123 మంది సప్లిమెంటరీ ఓటర్ల మ్యాపింగ్ పూర్తి
30న తుది జాబితా విడుదల
Comments
Please login to add a commentAdd a comment