విద్యార్థుల ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా?
వనపర్తి టౌన్: గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమని బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సమహేందర్ ఆరోపించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఎ.రాజశేఖర్ గౌడ్ అధ్యక్షతన క్రియాశీల సభ్యత్వ నమోదుపై గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల నాయకులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ చేపట్టిన సభ్యత్వ నమోదుకు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన లభించిందన్నారు. రాష్ట్రంలో 36 లక్షల సభ్యత్వాలు కాగా.. వనపర్తి జిల్లాలో పార్టీ లక్ష్యానికి 80 శాతం పూర్తయినట్లు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా విద్యాశాఖకు మంత్రిని నియమించకపోవడమే ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. రాష్ట్రాన్ని ఉత్తర, దక్షిణ భాగాలుగా విడదీసి వివక్షకు గురిచేస్తే సహించమన్నారు. ఆదిలాబాద్ నుంచి పాలమూరు వరకు విద్యార్థుల శ్రేయస్సు కోసం ఒకే రకమైన ప్రోత్సాహం అవసరమన్నారు. గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల మరణ వార్తలు చూసి తల్లిదండ్రులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారన్నారు. గురుకులాల్లో నోడల్ అధికారులను నియమించడంతో పాటు పాఠశాలల్లో హడ్‌హక్ కమిటీలను ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఏం ఉద్ధరించారని విజయోత్సవాలు నిర్వహిస్తున్నారో చెప్పాలన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ, సర్పంచుల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు మెంటెపల్లి పురుషోత్తంరెడ్డి, బి.శ్రీశైలం కదిరె మధు, సుధీర్, అరవింద్ రెడ్డి, రాజశేఖర్, ఎద్దుల రాజు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment